చేర్యాల్ పెయింటింగ్‌లు తెలంగాణ సంప్రదాయ జానపద చిత్రకళ. చేర్యాల్ పెయింటింగ్‌ను నకాషీ కళ, చెరియాల్ స్క్రోల్ పెయింటింగ్స్ అని కూడా పిలుస్తారు. సహజ రంగులతో ఖాదీ వస్త్రం లేదా ప్రత్యేకంగా తయారు చేసిన కాన్వాస్‌పై పురాణాలు, ఇతిహాసాలు, జానపద కథలు, గ్రామీణ జీవన విధానాన్ని చిత్రాల రూపంలో నకాషీ కళాకారులు ఆవిష్కరిస్తారు. చేర్యాల్ చిత్రకళ తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా దేశ విదేశాల్లోనూ గుర్తింపు పొందింది.
చేర్యాల్ చిత్రకళ 500 సంవత్సరాల నాటి సుదీర్ఘ చరిత్ర కల పురాతనమైన జానపద కళారూపం. పూర్వ కాలంలో కాకీ పడగొల్లు, భాగవతులు అనే సంచార కథకులు గ్రామాల్లో తిరుగుతూ ఈ పొడవైన స్క్రోల్ పెయింటింగ్స్ సాయంతో కథలు చెప్పేవాళ్లు. వీళ్లు పాడుతుంటే వెనక ఈ చిత్రపటాలను ఒక్కో ప్యానెల్ విప్పుతూ ప్రదర్శించేవాళ్లు. ఇది ఆనాటి దృశ్య- శ్రవణ మాధ్యమం. ఈ కళపై విజయనగర సామ్రాజ్య చిత్రకళా శైలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
నిజాం పరిపాలనకాలంలో ఈ కళను నకాష్ అని పిలిచేవాళ్లు. ఈ చిత్రాలను వేసే కళాకారులను నకాషీలు అంటారు. ఒకప్పుడు తెలంగాణ అంతటా విస్తరించిన ఈ కళ, కాలక్రమేణా కేవలం సిద్ధిపేట జిల్లాలోని చేర్యాల్ గ్రామానికి మాత్రమే పరిమితమైంది. అందుకే దీనికి చేర్యాల్ చిత్రకళ అనే పేరు స్థిరపడింది.
గతంలో రామాయణం, మహాభారతం, స్థానిక పురాణాలు, జానపద కథలు, కృష్ణలీలలు, పెళ్లి ఊరేగింపు, రైతులు పొలం పనుల నుంచి సన్నివేశాలను చేర్యాల్ నకాషీ పెయింటింగ్‌లో చూపిస్తారు. పొడవైన కథలకు బదులుగా కేవలం ఒక్క సన్నివేశాన్ని లేదా ఒక నిర్దిష్ట జానపద ఘట్టాన్ని చిన్న కాన్వాస్‌పై చిత్రీకరిస్తారు.
పెయింటింగ్స్ తయారీ ఇలా...
నకాషీ కళాకారులు చార్మినార్ ప్రాంతం నుంచి ఖాదీ వస్త్రాన్ని కొని, ఆర్డరు ప్రకారం ఒక అడుగు నుంచి 20 అడుగుల వరకు పెయింటింగ్ కోసం వీలుగా వస్త్రాన్ని ముక్కలు చేస్తారు. ముగ్గుపొడి అయిన సుద్దమట్టి, అన్నం వార్చిన గంజి, చింతపిక్కల పొడిని ఉడకబెట్టి జిగురుగా మారుస్తారు. దీనికి చెట్ల జిగురు అయిన తిరుమలై గమ్‌ను కలిపి అంబలిలా ఉడికించి, ఈ మిశ్రమాన్ని మూడు, నాలుగుసార్లు పూసి ఎండబెట్టి కాన్వాస్ వస్త్రాన్ని సిద్ధం చేస్తారు. దీనివల్ల క్లాత్, పెయింటింగ్ వేయడానికి అనువుగా మారుతుంది. ఆ తర్వాత సిద్ధమైన కాన్వాస్‌పై నల్లటి రంగు లేదా పెన్సిల్‌తో వివిధ కథలు, కళాఖండాలకు సంబంధించిన పాత్రల రూపాల అవుట్‌లైన్‌ను చేతితో గీస్తారు.
ప్రతి పాత్రకు పెద్ద కళ్లు, స్పష్టమైన ముక్కు, ముఖాలు ఉండటం ఈ శైలి ప్రత్యేకత. ఈ కళలో కేవలం ప్రకృతి నుంచి స్వభావసిద్ధంగా సేకరించిన రంగులనే వాడతారు. బ్యాక్‌గ్రౌండ్ కోసం ఎప్పుడూ ఎరుపురంగునే వాడతారు. పసుపు రంగును పసుపు కొమ్ముల నుంచి తయారుచేస్తారు. నీలంరంగును నీలిమందు మొక్కల నుంచి సేకరిస్తారు. తెలుపురంగు సముద్రపు శంఖాల పొడి లేదా సున్నం నుంచి తయారుచేస్తారు. నలుపురంగును దీపపు కాటుక నుంచి తీస్తారు.
చాలా సన్నని గీతలు గీయడానికి ఉడుత తోక వెంట్రుకలతో చేసిన ప్రత్యేకమైన బ్రష్‌లను నకాషీ కళాకారులు ఉపయోగిస్తారు. ఆ తర్వాత, బొమ్మల చుట్టూ నల్లటి రంగుతో అవుట్‌లైన్‌ను మరింత స్పష్టంగా తీర్చిదిద్దుతారు. చివరగా పెయింటింగ్ ఎక్కువకాలం పాడవకుండా ఉండటానికి, మెరుపు కోసం పైన సహజమైన జిగురు పూతను పూస్తారు.
కళాకారుల వలస
కళాకారులు బోడుప్పల్, గాజుల రామారం, జగద్గరిగుట్ట, బడంగ్ పేట ప్రాంతాలకు వచ్చి స్థిరపడ్డారు. ఇక్కడ ఆదాయం పెరగడంతోపాటు చేర్యాల నకాషీ కళకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో మరింత గుర్తింపు లభించిందని నకాషీ కళాకారుడు ధనాలకోట వైకుంఠం చెప్పారు.
వాల్ పెయింటింగ్‌లు
ప్రస్తుతం కళాకారులు సాంప్రదాయ స్క్రోల్ చిత్రాలతోపాటు వాల్ పెయింటింగ్‌లు (గోడ చిత్రాలు) కూడా రూపొందిస్తున్నారు. ఇళ్లు, కార్యాలయాలు, హోటళ్లు, ప్రభుత్వ భవనాల గోడలపై చేర్యాల శైలిలో చిత్రాలు వేస్తారు. రామాయణం, మహాభారతం, భాగవతం, తెలంగాణ జానపద కథలు, గ్రామీణ జీవనం, పండుగలు వంటి అంశాలను చిత్రీకరిస్తున్నారు. తాము రైల్వే స్టేషన్లు, కలెక్టర్ల కార్యాలయాల్లో వాల్ పెయింటింగ్‌లు చేశామని ధనాలకోట రాకేష్ చెప్పారు.
రూపుమారిన కళ..
30 నుంచి 60 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు ఉన్న వస్త్రంపై 40 నుంచి 50 ప్యానెల్స్‌గా విభజించి, ఒక సంపూర్ణమైన పురాణకథను సినిమా రీల్ మాదిరిగా వరుస క్రమంలో చిత్రీకరిస్తారు. నేటి ఆధునిక ఇళ్లలో గోడలకు ఫ్రేమ్ కట్టించుకోవడానికి వీలుగా కళాకారులు వీటిని తయారుచేస్తున్నారు.
విదేశాల్లోనూ నకాషీ ప్రదర్శన
యూకేలోని బర్మింగ్ హాం, ఇటలీలోని మలాన్ ఫెస్టివల్లో, స్విట్జర్లాండ్ లోని జెనీవాలో, జర్మనీ దేశంలోని బెర్లిన్ నగరంలో, మలేషియా, ఘనా దేశాల్లో నకాషీ చిత్రకళా ప్రదర్శన నిర్వహించామని కళాకారులు చెప్పారు.
నకాషీ కళాకారులకు అవార్డుల పరంపర
నకాషీ కళాకారుడు డి. వైకుంఠంకు జాతీయ పురస్కారం లభించింది.115వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన నకాషీ కళాకారుడు డి. వైకుంఠం ఐదు దశాబ్దాలుగా దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతున్నారని ప్రధాని కొనియాడారు.
ధనాలకోట సాయికిరణ్‌కు 2026లో ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఆర్టిస్ట్ ఇన్ రెసిడెన్స్ ప్రోగ్రామ్‌లో సత్కారం లభించింది. ఆయనకు రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు కూడా వచ్చాయి. ఇప్పటికే ఈ కళకు 2010వ సంవత్సరంలో జీఐ ట్యాగ్ వచ్చింది. ప్రస్తుతం తెలంగాణకు వస్తున్న అతిథులకు సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి చేర్యాల్ చిత్రకళా పెయింటింగ్‌లను బహుమతిగా అందజేస్తూ ప్రోత్సహిస్తున్నారు.
యువతకు శిక్షణ
చేర్యాల్లో ఈ కళాసంప్రదాయం కొనసాగేందుకు శిక్షణ, ప్రోత్సాహ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాను గత ఏడాది15 మంది యువకులకు చేర్యాల్ చిత్రకళపై శిక్షణ ఇచ్చానని పసుల మల్లేశం చెప్పారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఈ కళాఖండాల తయారీలో భాగస్వామ్యం అవుతున్నారు. పురుషులు సాధారణంగా కాన్వాస్ తయారీ, స్క్రోల్ సిద్ధం చేయడం, ఫ్రేమింగ్ వంటి పనులు చేస్తారు. మహిళలు సహజ రంగులు తయారు చేయడం, బేస్ కలర్స్ వేయడం, సూక్ష్మ అలంకరణ పనుల్లో నైపుణ్యం చూపిస్తున్నారు.
చేర్యాల్ మాస్క్‌లు
చేర్యాల్ మాస్క్‌లు చింతపిక్కల పొడి, రంపపు పొట్టు, సుద్దమట్టి మిశ్రమంతో తయారుచేస్తారు. ఇవి చిన్న కీ - చైన్ సైజు నుంచి పెద్ద వాల్ హ్యాంగింగ్ సైజుల వరకు లభిస్తాయి. గృహాలంకరణ వస్తువులు, వాల్ ప్లేట్లు, వృత్తాకార మట్టి లేదా చెక్క ప్లేట్లపై చేర్యాల్ రంగులు, శైలిని ఉపయోగించి అందమైన చిత్రాలు వేస్తున్నారు. తేలికపాటి పొనికి చెక్కతో బొమ్మలు చేసి, వాటిపై చేర్యాల్ నకాషీ రంగులను అద్దుతారు. నేమ్ ప్లేట్లు, పెన్ హోల్డర్స్ ఇలా ఒకటేమిటి మనం నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువులపై కూడా ఈ పురాతన కళను పెయింట్ వేసి విక్రయిస్తున్నారు.
చేర్యాల్ నకాషీ పెయింటింగ్‌లను రాష్ట్ర హస్తకళల సంస్థ ఆధ్వర్యంలోని గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్ ద్వారా లేదా ఆన్ లైన్ సేల్ వేదికలపై ఈ పెయింటింగ్‌లను కొనొచ్చు. ప్రత్యేక ఇ– - కామర్స్ వెబ్‌సైట్లు, ప్రభుత్వ హస్తకళల ఆన్‌లైన్ వేదికలు, సోషల్ మీడియా ద్వారా ఆర్డర్ చేయొచ్చు.
