మహబూబ్నగర్ రూరల్, వెలుగు : పాలమూరు యూనివర్సిటీ (పీయూ) ఆధ్వర్యంలో ఆగస్టు 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లోని కన్హా శాంతివనంలో నిర్వహించనున్న విజన్ ఇండియా-2047 ఇంటిగ్రేటింగ్ సైన్స్, ఇన్నోవేషన్ అండ్ యూత్ ఎంపవర్‌మెంట్ జాతీయ సెమినార్‌కు ముఖ్య అతిథులుగా విచ్చేయాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులను పీయూ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ ఆహ్వానించారు. ఆదివారం హైదరాబాద్‌లోని వారి నివాసాలలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విజన్ ఇండియా-2047 లక్ష్యాల సాధనలో ఉన్నత విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలు, పరిశోధనలు, ఆవిష్కరణలు, యువత పాత్రపై విస్తృత చర్చలు జరిపేందుకు ఈ జాతీయ సెమినార్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సదస్సులో దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, పరిశోధకులు, పరిశ్రమల ప్రతినిధులు, విధాన రూపకర్తలు పాల్గొని అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో ఉన్నత విద్యాసంస్థల పాత్రపై తమ అభిప్రాయాలను పంచుకుంటారని వివరించారు. ఈ కార్యక్రమం యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడంతో పాటు విద్యార్థులకు, పరిశోధకులకు కొత్త అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. రమేశ్‌బాబు, ఓఎస్డీ టు వైస్ ఛాన్సలర్ డాక్టర్ డి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
