వరంగల్‌‌ మేయర్ పీఠం దక్కించుకోవాలి : మంత్రి కొండా సురేఖ

వరంగల్‌‌ మేయర్ పీఠం దక్కించుకోవాలి : మంత్రి కొండా సురేఖ

వరంగల్​సిటీ/ఖిలావరంగల్‌‌(మామూనూరు), వెలుగు: త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక కార్పొరేటర్లను గెలిపించుకొని వరంగల్​మేయర్‌‌‌‌ పీఠం దక్కించుకోవాలని  రాష్ట్ర అటవీ, పర్యావరణ  దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వరంగల్​లైబ్రరీ సంస్థ చైర్మన్​గా ఎన్నికైన మీసాల ప్రకాశ్​ఆదివారం ప్రమాణ స్వీకారం చేయగా.. ఆమె హాజరై మాట్లాడారు. కార్పొరేటర్లను ఎక్కువగా గెలిపించుకోవడం ద్వారా ఎక్కువ మందికి పదవులు వస్తాయన్నారు. వరంగల్‌‌ తూర్పు నియోజకవర్గంలో ఏ సమస్యలున్నా పరిష్కరించేందుకు కొండా మురళి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. అంతకుముందు వరంగల్ క్లబ్ కార్యవర్గ (ఈసీ) సభ్యునిగా ఎన్నికైన మాజీ కార్పొరేటర్ పల్లం రవిని మంత్రి సన్మానించారు. వరంగల్ క్లబ్ అభివృద్ధికి సంక్షేమానికి ఆయన సమర్థవంతంగా సేవలందిస్తారన్నారు. 

రిత్విక్ తేజకు మంత్రి ప్రశంసలు

మొగుళ్లపల్లి: ఇటీవల హైదరాబాద్‌‌లో నిర్వహించిన మార్షల్ ఆర్ట్స్‌‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన విద్యార్థిని మంత్రి సురేఖ హనుమకొండలోని తన నివాసంలో ఆదివారం అభినందించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ రాజ్‌‌కుమార్ కొడుకు రిత్విక్ తేజ మార్షల్ ఆర్ట్స్‌‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డుతోపాటు గోల్డ్‌‌ మెడల్ సాధించడం గర్వకారణమన్నారు. మారుమూల ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా రిత్విక్​ తేజకు మంత్రి క్యాష్ అవార్డు అందజేశారు.