కొత్త ఓటర్ల నమోదుపై ఎన్నికల సంఘం (EC) కీలక నిర్ణయం తీసుకుంది. మొదటిసారి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసేవారు ఫారం-6తో పాటు తల్లిదండ్రుల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) వివరాలను కూడా తప్పనిసరిగా సమర్పించాలని కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ నిబంధన ప్రస్తుతం SIR ప్రక్రియలో ఉన్న ఓటర్లకే కాకుండా, కొత్తగా ఓటరు లిస్టులో పేరు నమోదు చేసుకునే వారందరికీ వర్తిస్తుందని ఈసీ అధికారులు తెలిపారు.
గత ఏడాది బీహార్‌లో ప్రారంభించిన SIR కార్యక్రమంలో ఈ విధానాన్ని అమలు చేశారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఓటరు నమోదు చేసుకునే ముందు పేరెంట్స్ వివరాలు ఇవ్వడం తప్పనిసరి చేశారు. అయితే ఫారం-6లో ఎలాంటి మార్పులు చేయలేదని, పరిపాలనా ఆదేశాల ద్వారా మాత్రమే ఈ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే..SIR ప్రక్రియపై వచ్చిన విమర్శలను కూడా ఎన్నికల సంఘం ఖండించింది. నకిలీ ఓటర్లు, మరణించిన వారు, వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు, విదేశాల్లో స్థిరపడిన వారు వంటి అనర్హులను జాబితా నుంచి తొలగించి, అర్హులైన భారతీయ పౌరుల పేర్లు మాత్రమే ఓటరు జాబితాలో ఉండేలా చేయడమే సర్ లక్ష్యమని తెలిపింది.
పశ్చిమ బెంగాల్‌లో మైనారిటీ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని తొలగించారన్న ఆరోపణలను కూడా ఈసీ తోసిపుచ్చింది. ఎవరైనా తమ పేరు తొలగించారని భావిస్తే అభ్యంతరం చెప్పే అవకాశం కల్పిస్తున్నామని తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, పక్షపాతం లేకుండా జరుగుతోందని స్పష్టం చేసింది.
