ముంబై: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. పవన్ కుడి భుజంలోని రొటేటర్ కఫ్‌కు తీవ్రగాయమైందని.. రెండు ప్రధాన టెండన్లు చిట్లినట్లు వెల్లడించింది. శనివారం (జులై 11) పవన్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసింది. కొంతకాలం పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. విశ్రాంతి అనంతరం షోల్డర్ రిహాబిలిటేషన్ ప్రారంభించనున్నట్లు తెలిపింది.
కాగా, ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ గతకొంత కాలంగా భుజం నొప్పి సమస్యతో బాధపడుతోన్న విషయం తెలిసిందే. నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. శనివారం (జులై 11) ప్రత్యేక వైద్య బృందం సుమారు మూడున్నర గంటల పాటు శ్రమించి పవన్‌కు విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.
వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భుజానికి ఆపరేషన్ చేసుకున్న తన డిప్యూటీని ఆదివారం (జులై 12) ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరుబాయ్ ఆసుపత్రికి వెళ్లి పవన్‌తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. గాయం నుంచి పవన్ త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో పాల్గొని ఆకాంక్షించారు సీఎం చంద్రబాబు.
