దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న రొమాంటిక్ యాక్షన్ డ్రామా 'శ్రీనివాస మంగాపురం'. తొలి చిత్రంతోనే హీరోగా పరిచయం అవుతున్న జయకృష్ణ ఘట్టమనేని, హీరోయిన్‌గా రాశా తడాని నటించిన ఈ సినిమా జూలై 30, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. లేటెస్ట్ గా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ చూస్తే అజయ్ భూపతి మరోసారి తనదైన స్టైల్‌లో ప్రేమ, భావోద్వేగాలు, యాక్షన్‌ను మేళవించిన కథను తెరపై ఆవిష్కరించబోతున్నట్లు స్పష్టమవుతోంది.
ట్రైలర్ ఆరంభంలో తిరుపతి అందమైన నేపథ్యంలో శ్రీను, మంగా మధ్య చిగురించే అమాయక ప్రేమను ఎంతో అందంగా చూపించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సహజంగా కనిపిస్తూ యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. అయితే కథ ముందుకు సాగే కొద్దీ వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. మోహన్ బాబు పోషించిన వెంకటప్పయ్య నాయుడు పాత్ర ఎంట్రీతో కథలో తీవ్రత పెరుగుతుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
తన ప్రేమ కోసం శక్తివంతమైన ప్రత్యర్థిని ఎదిరించే యువకుడిగా జయకృష్ణ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. రాశా తడాని తన ఎక్స్‌ప్రెషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించింది. కథలోని కీలక ట్విస్టులను రివీల్ చేయకుండా ఆసక్తిని పెంచేలా ట్రైలర్‌ను కట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సాంకేతికంగా కూడా ట్రైలర్ హై స్టాండర్డ్‌లో ఉంది. తిరుపతి పరిసరాల అందాలను అద్భుతంగా బంధించిన సినిమాటోగ్రఫీ, జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశానికి మరింత బలం చేకూర్చాయి. సి. అశ్విని దత్ సమర్పణలో, పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం చందమామ కథలు బ్యానర్‌పై రూపొందుతోంది. ట్రైలర్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే విడుదలకు ముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూలై 30న థియేటర్లలో ఈ యాక్షన్ జాతరను చూడటానికి రెడీ అయిపోండి.
