- మహబూబ్ నగర్ లో ఇద్దరు..
- ములుగు జిల్లాలో మరో ఇద్దరు మృత్యువాత
మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు : ఆటో, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఈ ప్రమాదం మహబూబ్ నగర్ శివారులో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ కు చెందిన ముజ్జు, జిలానీ, అజహర్ ఆదివారం మధ్యాహ్నం పాలమూరు జిల్లా దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ వద్దకు వెళ్లారు. అక్కడ చేపల కొనుగోలు చేసి సాయంత్రం ఆటోలో స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు.
మహబూబ్ నగర్ శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. ప్రమాదంలో ముజ్జు, జిలానీ అక్కడికక్కడే చనిపోగా అజహర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అజహర్ ను మహబూహబ్ నగర్ హాస్పిటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
ములుగు, వెలుగు : గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కూలీలు చనిపోయారు. ఈ ఘటన ములుగు జిల్లా మల్లంపల్లిలో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మల్లంపల్లి శివాజీ నగర్ వద్ద ఇద్దరు వ్యక్తులు రోడ్డు దాటుతున్నారు. ఇదే సమయంలో హనుమకొండ వైపు నుంచి ములుగు వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. చనిపోయిన ఇద్దరి వివరాలు తెలియరాలేదు.
