ఆ వెయ్యి అభ్యంతరాలేవో చెప్పండి..ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈసీకి కవిత లేఖ 

ఆ వెయ్యి అభ్యంతరాలేవో చెప్పండి..ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈసీకి కవిత లేఖ 
  • తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపునివ్వాలని విజ్ఞప్తి
  • ఒకేరకమైన పేర్లతో దేశంలో వందలాది పార్టీలున్నాయని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపునివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ చీఫ్​ కవిత విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ పేరును తమకు కేటాయిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 28న లేఖ ద్వారా సమాచారం ఇచ్చిందని గుర్తుచేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించుకోవడంతోపాటు పార్టీ నిర్మాణపరమైన కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.

ఈనెల 7న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఆమె ఆదివారం లేఖ రాశారు. టీఆర్ఎస్ పేరుపై వెయ్యి అభ్యంతరాలు వచ్చాయంటూ గత నెల 23న ఈసీ లేఖ రాసిందని, కానీ ఆ అభ్యంతరాల్లో ఒక్కటి కూడా ఇప్పటివరకు తమకు చప్పలేదని పేర్కొన్నారు. అభ్యంతరాలు చెప్పిందెవరు..? ఆ అభ్యంతరాలేంటన్న వివరాలు ఇవ్వలేదన్నారు.

అలాంటప్పుడు తాము వాటికి సమాధానం ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. ఆ వెయ్యి అభ్యంతరాలేవో చెప్పాలన్నారు. రాష్ట్ర జనాభా మూడున్నర కోట్లు అని, వెయ్యి అభ్యంతరాలని చెప్తూ పార్టీ పేరును కేటాయించలేమని చెప్పడం సరికాదన్నారు. ఈసీ ఆమోదించిన పేరును నమ్ముకొని సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేసుకున్నామని, ఇప్పుడు ఆ పేరును మార్చుకోవాలని చెప్పడం అన్యాయమన్నారు.  

ఆ పేరుతో దేనికీ పోలిక లేదు..

తెలంగాణ రక్షణ సేన అనే పేరుతో దేశంలో మరే ఇతర రాజకీయ పార్టీ కూడా నమోదు కాలేదని, ఇది ఏ గుర్తింపు పొందిన లేదా నమోదైన రాజకీయ పార్టీ పేరును పోలి లేదని కవిత లేఖలో పేర్కొన్నారు. పార్టీ పేర్ల మధ్య పోలిక పెట్టేటప్పుడు కేవలం పూర్తి పేరునే పరిగణనలోకి తీసుకోవాలని, షార్ట్​ ఫామ్స్​ను కాదని తెలిపారు. ఒకేరకమైన పేర్లతో దేశంలో వందలాది పార్టీలున్నాయని వెల్లడించారు. ఎన్నికల కమిషన్ తమకు పంపిన అభ్యంతరాల్లోని ‘తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రాటిక్) (2024)’, ‘తెలంగాణ రాజ్య సమితి (2023)’ అనేవి వేర్వేరు పేర్లని చెప్పారు.

ఆ పేర్లతో తెలంగాణ రక్షణ సేనను దాని సమగ్ర రూపంలో పరిశీలించినప్పుడు, అది పూర్తి భిన్నంగా, స్పష్టంగా గుర్తించదగిన రాజకీయ పార్టీగా తెలుస్తోందన్నారు. ప్రస్తుతం ఉనికిలో ఉన్న ఏ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీతోనూ తమ పార్టీ పేరుకు పోలిక లేదన్నారు. అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి, సమాధానం ఇవ్వడానికి తమకు తగినంత సమయం ఇచ్చాకే వ్యక్తిగత విచారణకు పిలవాలని విజ్ఞప్తి చేశారు.