నేపాల్ లో మళ్లీ జెన్ Z నిరసనలు.. బాలెన్ షాకు వ్యతిరేకంగా రోడ్లపైకి యువత

నేపాల్ లో మళ్లీ జెన్ Z నిరసనలు.. బాలెన్ షాకు వ్యతిరేకంగా రోడ్లపైకి యువత

నేపాల్ మళ్లీ  జెన్ జీ నిరసన జ్వాలలు చెలరేగాయి. నేపాల్  ప్రధాని బాలెన్ షా ప్రభుత్వ ఏకపక్ష ఏకపక్ష విధానాలను వ్యతిరేకిస్తూ యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. కాట్మండులోని ప్రభుత్వప్రధాన కార్యాలయం ఎదుట నిరసనలకు దిగారు. జాయింట్ నేషనల్ స్క్వాటర్స్ ఫ్రంట్  ఆధ్వర్యంలో  యువత పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు. పేదలపై  జులం అంతం కావాలి, మానవ హక్కులను గౌరవించాలి, అక్రమ అరెస్టులను ఆపాలి, నిర్వాసితులకు ఆశ్రయం కల్పించండి అంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ఇది గతేడాది కేపీ శర్మ ఓలి  ప్రభుత్వానికి  వ్యతిరేకంగా జరిగిన జెన్ జెడ్ నిరసనల తరహాలో తాజా నిరసనలు తలెత్తడం చర్చనీయాంశమైంది. ఇది బాలెన్ షా ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా మారింది. 

సోమవారం (జూలై 13) నేపాల్ రాజధాని కాట్మండులో వందలాది మంది యువత రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. నేపాల్‌లోని పేదల ఇళ్లను కూల్చడాన్ని నిరసిస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఇళ్లు కోల్పోయిన  25 ఏళ్ల గణేష్ నేపాలీ ఆత్మాహుతి చేసుకోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. ప్రధాని బాలెన్ షా అధికారంలో రావడానికి ఏ Gen-Z  యువత అయితే బలంగా నిలిచారో, ఇవాళ అదే యువత ఆయనకు వ్యతిరేకంగా వీధుల్లోకి రావడం గమనార్హం.

ఖాట్మండు మురికి వాడల్లో పేదల ఇండ్లను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా నిరసనలు జరుగుతున్నప్పటికీ, ఇప్పుడు అవి పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారాయి. నిర్వాసితులకు ఎటువంటి ఆశ్రయం కల్పించకుండానే పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చివేస్తోందని యువత ఆరోపిస్తోంది. శుక్రవారం ఖాట్మండులోని ఓ పునరావాస కేంద్రం వరద బారిన పడటంతో, అక్కడ తలదాచుకుంటున్న 150 మంది చిక్కుకుపోయారు. మరుసటి రోజు, పరిస్థితులను పరిశీలించేందుకు  జెన్-జెడ్ కార్యకర్తలు అక్కడికి చేరుకోగా, పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు.ఈ ఘటనలో ఒక కార్యకర్త ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ఖాట్మండులో గణేష్ నేపాలీ అనే 25 ఏళ్ల నిరసనకారుడు తన మోటార్‌సైకిల్‌కు పోలీసులు  వీల్ లాక్  వేశారని  ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో యువత ఆగ్రహానికి కారణమయ్యాయి. 

మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన పలువురు సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, జర్నలిస్టులను అరెస్టు చేశారు. రాజధానికి 206 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోషి ప్రావిన్స్‌లో, నిరసనకారులకు మద్దతుగా గళం విప్పిన 26 మందిని అరెస్టు చేశారు. నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు గగన్ కుమార్ థాపా కూడా ఈ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. 

నేపాల్‌వ్యాప్తంగా ఏప్రిల్ 2026 నుంచి ఆక్రమణల తొలగింపు ప్రారంభించి బాలెన్ షా ప్రభుత్వం. దాదాపు 2వేల600కు పైగా ఇళ్లను కూల్చివేశారు. దీంతో  15వేల  మంది నిరాశ్రయులయ్యారు. వీరిలో 325 కుటుంబాలు తాత్కాలిక ఆశ్రయ కేంద్రాల్లో నివసిస్తున్నాయి.


జూలై 6 లోపు పునరావాస కేంద్రాలను ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే తలదాచుకునేందుకు వారి వేరే చోటు లేకపోవడంతో 60 కుటుంబాలు అక్కడి నుంచి వెళ్లేందుకు నిరాకరించాయి. దీంతో ప్రభుత్వం బలవంతంగా  ఖాళీ చేయిస్తోంది. 

ఈ నిరసన ప్రధాని  బాలెన్ షా  ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎదురైన అతిపెద్ద సవాల్. గత ఏడాది కేపీ శర్మ ఓలీ ప్రభుత్వాన్ని కూలదోసిన జెన్ జెడ్ నిరసనలకు బాలెన్ షా బహిరంగంగా మద్దతు ఇచ్చారు. ఇవాళ అదే యువత ఆయన విధానాలకు వ్యతిరేకిస్తూ వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టడం చర్చకు దారితీసింది.