ఏడు దశాబ్దాల పోరాటగాథ..క్యూబా విప్లవం

ఏడు దశాబ్దాల పోరాటగాథ..క్యూబా విప్లవం

ఏడు దశాబ్దాలు.. ఎన్నో   కుట్రలు, కుతంత్రాలు, ఆంక్షలు, ఆర్థిక దిగ్బంధనాలు, దుష్ప్రచారాలు, దురాక్రమణ యత్నాలు.. అన్నిటికీ ఎదురు నిలిచి, ఎదిరించి, ఎగురుతున్న ధిక్కార పతాకం క్యూబా. ఉత్తర, దక్షిణ అమెరికా మధ్యలో, కరేబియన్ ద్వీపకల్పంలో ఉన్న ఈ చిన్న దేశం డెబ్బై ఏళ్లుగా అమెరికాకు కొరకరాని కొయ్యలా మారింది. 

అగ్రరాజ్య సామ్రాజ్యవాద కబంధహస్తాలకు చిక్కకుండా ముప్పుతిప్పలు పెడుతోంది. అంతరిక్షాన్ని సైతం చెరబట్టగల అణ్వస్త్ర దేశాన్ని మూడు చెరువుల నీరు తాగిస్తోంది. ఇంతటి గొప్ప పోరాటాన్ని, దాని ఫలితాన్ని, పరిణామాలను మనకందించే ప్రయత్నమే ‘‘విప్లవ క్యూబా : ఏడు దశాబ్దాల అనుభవాలు, పోరాటాలు’’ పుస్తకం.

రచయితలు నోమ్ చోమ్‌స్కీ,  విజయ్ ప్రసాద్ ఆంగ్లంలో రాసిన ‘‘On Cuba: Reflections on 70 Years of Revolution and Struggle’’ పుస్తకానికి కె. సత్యరంజన్ అనువాదమిది.  బాటిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా1959లో ఫిడెల్ కాస్ట్రో నేతృత్వంలో జరిగిన విప్లవం తర్వాత క్యూబా ఎదుర్కొన్న/ ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ పుస్తకంలో పొందుపరిచారు. అమెరికా విధించిన ఆంక్షలు క్యూబా ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేశాయో, ఎన్ని మానవ హక్కుల ఉల్లంఘనలకు కారణమయ్యాయో వివరించారు.  

సోవియట్ యూనియన్ పతనం తర్వాత క్యూబా ఎదుర్కొన్న కష్టాలను కళ్లకు కట్టినట్లు పొందుపరిచారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షులు రోనాల్డ్ రీగన్, కెన్నెడీ, ఒబామా, డొనాల్డ్ ట్రంప్ తదితరులు క్యూబాపై అనుసరించిన/ అనుసరిస్తున్న నిరంకుశ, అణచివేత ధోరణి సైతం ప్రస్తావించారు. వీళ్ల నియంతృత్వానికి వంతపాడేలా అసోసియేటెడ్ ప్రెస్, సీఎన్ఎన్, రాయిటర్స్ వంటి పాశ్చాత్య మీడియా ప్రవర్తించిన తీరునూ చదువుతుంటే అందరొక్కటై ఒక చిన్న దేశాన్ని ఎన్ని ఇబ్బందులకు గురిచేశారో అనిపించక మానదు. 

అమెరికాకు కూతవేటు దూరంలో ఉన్న ఈ చిన్న దేశంలోని విప్లవం గురించే కాదు.. సోషలిస్ట్ భావజాలంతో వైద్యం, విద్య, సమానత్వం వంటి రంగాల్లో సాధించిన ప్రగతినీ పుస్తకంలో వివరించారు. ముఖ్యంగా క్యూబా వైద్యులు ప్రపంచ వ్యాప్తంగా సహాయం చేయడంతో పాటు, లాటిన్ అమెరికా, ఆఫ్రికాలో నియంతృత్వ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం వంటివి చదువుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది.  

కాస్ట్రోను అంతం చేయడానికి 600సార్లకు పైగా చేసిన ప్రయత్నాలు; ‘బే ఆఫ్ పిగ్స్’, ‘ఆపరేషన్ మంగూస్’ దురాక్రమణ యత్నాలు;  క్యూబా ప్రజలు, పంటలపై ‘ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ’ వైరస్, జీవాయుధాలతో దాడికి ప్రయత్నించడం వంటి వాటిని క్యూబా ఎదుర్కొన్న తీరు స్ఫూర్తిదాయకం. 

పుస్తకంలో భాష సరళంగా ఉంది. సాధారణ పాఠకుడికి సైతం అర్థమవుతుంది. అయితే క్యూబా అంతర్గత రాజకీయ సమస్యలు, వ్యతిరేకత గురించి ఎక్కువ కనిపించదు. బహుశా రచయితల వామపక్ష భావజాలం వల్ల ఈ అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వలేదేమో అనిపిస్తుంది. 

మొత్తమ్మీద ‘విప్లవ క్యూబా’ పుస్తకం కేవలం గతంలో జరిగిన ఒక చరిత్రను చెప్పే పుస్తకం కాదు. ఇది సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఒక చిన్న దేశం చేసిన/చేస్తున్న అద్భుత పోరాటానికి అక్షర రూపం. ఆధునిక ప్రపంచ రాజకీయాలు, సామ్రాజ్యవాదం గురించి తెలుసుకోవాలనుకునే వాళ్లకు ఈ పుస్తకం ఉపయోగకరం. 

రచయితలు: నోమ్​ చోమ్​ స్కీ ,విజయప్రసాద్​  ( అనువాదం : కె సత్యరంజన్​)
పేజీలు : 120..ధర : రూ.120 
ప్రతులకు : ఆన్​లైన్​లో..