బ్యాంకాక్ లో భారీ అగ్ని ప్రమాదం..బార్ లో చెలరేగిన మంటలు.. 27 మంది కాలి బూడిదయ్యారు

బ్యాంకాక్ లో భారీ  అగ్ని ప్రమాదం..బార్ లో చెలరేగిన మంటలు.. 27 మంది కాలి బూడిదయ్యారు

పబ్ కస్టమర్లతో కిటకిటలాడుతోంది.. రిథమిక్  మ్యూజిక్ కు కస్టమర్లు డ్యాన్సులతో ఊగిపోతున్నారు..ఇంతలోనే ఊహించని ప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. క్షణాల్లోపబ్ మొత్తం వ్యాపించాయి.. చూస్తుండగానే అక్కడున్న వారిని మంటలు చుట్టుముట్టాయి. హెల్ప్ హెల్ప్ అంటూ అరుపులు.. 27మంది మంటల్లో సజీవ దహనం.. థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ రెస్టారెంట్ లో ఘోర ప్రమాదం జరిగింది.  
సోమవారం(జూలై 13) తెల్లవారు జామున బ్యాంకాక్ లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 27 మంది మంటల్లో కాలిపోయారు. 63 మందికి  తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.  

బ్యాంకాక్ పోలీసుల ప్రకారం.. సోమవారం తెల్లవారు జామున రంగ్ బీర్ నా లాట్ ఫ్రావో బార్  అండ్ రెస్టారెంట్ లో ఈ ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో 27 మంది మంటల్లో కాలి బూడిదయ్యారు. మరో 63మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  వారిలో 27 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. రెస్టారెంట్ కు ఒకే ఎంట్రన్స్ ఉండటంతో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

గతంలో కూడా థాయ్ లాండ్ లో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. 2022లో తూర్పు థాయ్ లాండ్ లో ఓ మ్యూజికల్ పబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 124 మంది చనిపోయారు. అంతకుముందు 2009 లో  బ్యాంకాక్ లోని శాంతికా   నైట్ క్లబ్ లో న్యూఇయర్ వేడుకల సందర్భంగా జరిగిన ప్రమాదంలో 66 మంది ప్రాణాలు కోల్పోయారు.