కాంగ్రెస్‌‌లో  పంచాయితీలు సహజం..తుంగతుర్తి వివాదంపై నివేదిక సిద్ధమైంది: జగ్గారెడ్డి

కాంగ్రెస్‌‌లో  పంచాయితీలు సహజం..తుంగతుర్తి వివాదంపై నివేదిక సిద్ధమైంది: జగ్గారెడ్డి
  • నేడు పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌ గౌడ్‌‌కు రిపోర్ట్ ఇస్తానని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో పంచాయితీలు సహజమని, తమ పార్టీ నేతలు ఏదైనా ఉంటే బయట మాట్లాడుతారని, అదే ఇతర పార్టీల నేతలు లోపల మాట్లాడుతారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం గాంధీ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తుంగతుర్తి నియోజకవర్గ వివాదంపై పీసీసీ అబ్జర్వర్‌‌‌‌గా గత రెండ్రోజులుగా గాంధీ భవన్‌‌లో విచారణ పూర్తి చేసినట్లు చెప్పారు.

స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, డీసీసీ అధ్యక్షులు, 9 మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలతో సమావేశమై సమాచారం సేకరించినట్లు చెప్పారు. వివాదం ఎక్కడ మొదలైంది, దీనికి ముగింపు ఎక్కడ అనేది గుర్తించానని.. దీనిపై పూర్తి రిపోర్ట్‌‌ను సోమవారం పీసీసీ చీఫ్ మహేశ్‌‌ గౌడ్‌‌కు అందజేస్తానని తెలిపారు. 

హరీశ్‌‌ రావు సినిమా డైలాగ్‌‌లు బంద్ చేయ్... 

బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే హరీశ్‌‌ రావు తన సినిమా డైలాగులు బంద్ చేయాలని, ఆయన మాటల్లో పస లేదని జగ్గారెడ్డి విమర్శించారు. నీకు నచ్చకపోతే ఎదుటివారు సైకోలు అవుతారా అంటూ ప్రశ్నించారు. కేవలం సీఎం రేవంత్ రెడ్డిపై ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతోనే హరీశ్‌‌ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలు వాస్తవమన్నారు.

ఈ అంశంపై చర్చించేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు. అలాగే, బీజేపీ నేత ఈటల రాజేందర్‌‌‌‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్‌‌‌‌తో కలిసి పనిచేశారు కాబట్టి, ఢిల్లీలో కేంద్ర ఇరిగేషన్ మంత్రి, ఎన్డీఎస్ఏ అధికారులతో రాష్ట్ర నేతలకు సమావేశం ఏర్పాటు చేయించాలని సూచించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడమే ప్రస్తుత ప్రభుత్వానికి సరిపోతోందని జగ్గారెడ్డి విమర్శించారు.