పాలకవీడు, వెలుగు : సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు పాడిపంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలని ఎమ్మెల్సీ, ఆదివాసీ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర చైర్మన్ శంకర్ నాయక్ ఆకాంక్షించారు.
ఆదివారం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం కల్మెట తండాలో గిరిజనులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శీత్లా పండుగ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బంజారా గిరిజనులు ఏటా జూలై నెలలో ప్రకృతిని, శీత్లా భవానీని ఆరాధిస్తూ ఈ పండుగను జరుపుకుంటారని, పాడిపంటలు, పశువులు, కుటుంబాలు అంటువ్యాధులు, వేసవి తాపం నుంచి చల్లగా ఉండాలని వేడుకుంటారని తెలిపారు. వేడుకల్లో భాగంగా గిరిజన మహిళలు గుగ్గిళ్లను వండి శీత్లా మాతకు నైవేద్యంగా సమర్పించారు.
