యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వరుస సెలవుల కారణంగా ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, పుష్కరిణి, పార్కింగ్ ప్రాంతాలు కిక్కిరిసిపోగా, స్వామివారి ధర్మ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పట్టింది.
భక్తుల వాహనాలు భారీగా రావడంతో కొండపై పార్కింగ్ నిండిపోవటంతో ఘాట్ రోడ్డు సర్కిల్, రింగు రోడ్డుల్లో వాహనాలు బారులు తీరాయి. ఆలయంలో నిర్వహించిన సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణంలో విశేషంగా పాల్గొన్న భక్తులు సమర్పించిన పూజలు, ప్రసాద విక్రయాలు, దర్శన టికెట్లు, వాహన రుసుముల ద్వారా ఆదివారం ఒక్క రోజే ఆలయానికి రూ. 68,22,052 ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.
