స్టాక్ మార్కెట్‌కు టెన్షన్ వీక్.. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం ఎఫెక్ట్

స్టాక్ మార్కెట్‌కు టెన్షన్ వీక్.. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం ఎఫెక్ట్

నికర కొనుగోలుదారులుగా మారిన విదేశీ ఇన్వెస్టర్లు

న్యూఢిల్లీ: ఈ వారం ఇన్వెస్టర్ల  సెంటిమెంట్‌‌ను పలు అంతర్జాతీయ, దేశీయ పరిణామాలు ప్రభావితం చేయనున్నాయి. ముఖ్యంగా అమెరికా–-ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, దేశీయ కంపెనీల జూన్ క్వార్టర్‌‌‌‌ ఫలితాలు,  అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు మార్కెట్ డైరెక్షన్‌‌ను  నిర్దేశించనున్నాయి. వీటితో పాటు దేశీయ ద్రవ్యోల్బణం డేటా, రుతుపవనాల పురోగతి వంటివి కూడా మార్కెట్‌‌పై ప్రభావం చూపుతాయి.  దేశీయంగా సోమవారం రిటైల్ ద్రవ్యోల్బణం,  మంగళవారం హోల్‌‌సేల్ ద్రవ్యోల్బణం డేటా  వెలువడనున్నాయి.  అంతర్జాతీయంగా చూస్తే, అమెరికాలో సీపీఐ, పీపీఐ డేటా విడుదలకానున్నాయి. 

వీటి  ఆధారంగా  ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందో మార్కెట్ అంచనా వేయనుంది. మరోవైపు క్వార్టర్లీ రిజల్ట్స్  సీజన్‌ ఇప్పటికే మొదలైంది.  ఈ వారం ఐటీ కంపెనీలు  హెచ్‌‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రాలతో పాటు యూనియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ వంటి  సంస్థలు తమ  ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ ఫలితాలతో పాటు ఆయా కంపెనీలిచ్చే గైడెన్స్‌‌  మార్కెట్‌‌పై ప్రభావం చూపుతాయి. 

ఎఫ్‌‌ఐఐలు రూ.15,157 కోట్ల కొనుగోళ్లు

గత నాలుగు నెలలుగా భారత మార్కెట్లో వరుసగా షేర్లను విక్రయించిన విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌ఐఐలు), ఈ నెలలో మళ్లీ కొనుగోలుదారులుగా మారారు. దేశీయంగా రూపాయి విలువ స్థిరంగా ఉండడం,  ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడంతో  ఈ నెలలో ఇప్పటివరకు  నికరంగా రూ. 15,157 కోట్ల విలువైన షేర్లు కొన్నారు.