వార్డెన్ వేధింపులు, వివక్షపై కేజీబీవీ విద్యార్థినుల ఆందోళన

వార్డెన్ వేధింపులు, వివక్షపై కేజీబీవీ విద్యార్థినుల ఆందోళన

జోగిపేట, వెలుగు :   సంగారెడ్డి జిల్లా వట్​పల్లి మండలానికి చెందిన కేజీబీవీ పాఠశాలకు సొంత భవనం లేకపోవడంతో అందోల్ కేజీబీవీ భవనంలోనే రెండు హాస్టళ్ల విద్యార్థినులకు వసతి కల్పించారు. అందోల్ హాస్టల్ వార్డెన్ తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ తీవ్ర వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ వట్​పల్లి కేజీబీవీ విద్యార్థినులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు.

అందోల్ విద్యార్థినులకు భోజనం పెట్టిన తర్వాతే తమకు పెడుతున్నారని, గదులు చాలకపోవడమే కాకుండా స్నానానికి వెళ్తే నెట్టేస్తూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వార్డెన్ వేధిస్తున్నట్లు బాలికలు కంటితడి  పెట్టారు. తమను వేరే చోటుకు మార్చాలని డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న విద్యార్థుల  తల్లిదండ్రులు కూడా అధికారులను నిలదీశారు. పోలీసులు జోక్యం చేసుకుని, విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చి విద్యార్థినులను, వారి తల్లిదండ్రులను సముదాయించారు.