చెరువులో మునిగి ఇద్దరు స్టూడెంట్లు మృతి.. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ లో ఘటన

చెరువులో మునిగి ఇద్దరు స్టూడెంట్లు మృతి.. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ లో ఘటన

కొండాపూర్, వెలుగు : ఫొటో కోసం చెరువులోకి దిగిన ఇద్దరు స్టూడెంట్లు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ చెరువు వద్ద ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సంగారెడ్డిలోని తారా డిగ్రీ కాలేజీకి చెందిన సతీష్ (17), ప్రశాంత్ (19), ప్రభాకర్, సుధాకర్, రాఘవేందర్ కలిసి ఆదివారం సాయంత్రం మల్కాపూర్ చెరువు వద్దకు వెళ్లారు. 

సుధాకర్ గట్టుపై నిలబడి ఫొటోలు తీస్తుండగా.. మిగిలిన నలుగురు నీటిలోకి దిగారు. ఈ క్రమంలో లోతైన ప్రాంతానికి వెళ్లడంతో సతీష్, ప్రశాంత్ నీటిలో మునిగిపోగా, ప్రభాకర్, రాఘవేందర్ ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకున్నారు. 

వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లను రప్పించి చెరువులో గాలించి సతీష్, ప్రశాంత్ లను బయటకు తీశారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా... పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సోమేశ్వరి తెలిపారు.