కరీంనగర్ టౌన్, వెలుగు: ఎన్నికల కమిషనకర్ నిర్దేశించిన గడువు జులై 24 లోపు ఓటరు సవరణ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 14 శాతం మాత్రమే పూర్తయిందని మాజీ మంత్రి, కరీంనగర్ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్ లోని కిసాన్ నగర్‌తో పాటు చింతకుంటలో ఎస్ఐఆర్ హెల్ప్‌డెస్క్‌లను గంగుల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ యంత్రాంగం, బీఎల్వోల సమన్వయ లోపంతోనే ఓటరు సవరణ ప్రక్రియ ఆలస్యంగా జరుగుతోందని, సర్వర్లు సరిగా పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
అందుకే తాము రంగంలోకి దిగి, 10 కేంద్రాల ద్వారా ప్రజలకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను పూర్తి చేసేందుకు ఉచిత సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ గడ్డి ప్రదీప్, కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రుద్ర రాజు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
