హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్మాటలు వింటే ఒక శాడిస్ట్ మాట్లాడుతున్నడా? అన్న అనుమానం కలుగుతున్నదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆయన మాటల్లో మూడు లక్షణాలు స్పష్టంగా కనిపించాయని, పచ్చి అబద్ధాలు, బూతులు, శాడిజం తప్ప ఏమీ లేవని మండిపడ్డారు. రైతులు సాగునీళ్లడిగితే ప్రతిపక్షాల రక్తాన్ని పంటలపై చల్లాలి..బెల్టుతో కొట్టాలని ఒక సీఎం మాట్లాడడం దారుణమని అన్నారు. హిట్లర్ తనకు ఆదర్శమన్న రేవంత్‌రెడ్డి, అదే హిట్లర్ తరహాలో భాష మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
మొన్నటి వరకు గోదావరిలో నీళ్లే లేవు అని అబద్ధం చెప్పిన సీఎం రేవంత్.. అక్కడికి వెళ్లి పారుతున్న గోదావరిని లైవ్‌లో చూపించాలని కేటీఆర్ అనగానే నాలుక కరుచుకున్నారన్నారు. మేడిగడ్డ గేట్లు మూయకుండా కన్నెపల్లి మోటార్లు ఎలా నడుపుతారంటూ సీఎం అజ్ఞానంతో మాట్లాడుతుంటే, పక్కనే ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మైక్ లాక్కుని సరిచేయాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ‘‘కన్నెపల్లి మోటార్లు 93.5 మీటర్ల ఎత్తులో నడుస్తాయి. ప్రస్తుతం నదిలో లక్ష క్యూసెక్కుల వరద పోతోంది. నీటిమట్టం 97.5 మీటర్ల ఎత్తులో ఉంది. గేట్లు మూయాల్సిన అవసరమే లేదు.
నిన్నటి దాకా నిపుణుల కమిటీ, రిటైర్డ్ ఇంజనీర్లు అన్న సీఎం.. ఇప్పుడు వాళ్లు నీళ్లు ఎత్తమని టెక్నికల్ సూచన చేయగానే వారిని జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు కూడా కేవలం రూ.8.5 కోట్ల ఖర్చుతో ఒక కాపర్ డ్యామ్ కట్టుకుని నీళ్లు ఎల్లంపల్లికి తీసుకువెళ్లొచ్చని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ లేఖను ప్రభుత్వం బయటపెట్టాలి’’ అని డిమాండ్ చేశారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టును మేం పూర్తి చేసినం
ఎల్లంపల్లి ప్రాజెక్టును 20 ఏండ్ల క్రితమే కాంగ్రెస్ కట్టిందని సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పారని హరీశ్ రావు విమర్శించారు. 2004లో ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు మంత్రిగా తన పేరు కూడా శిలాఫలకంపై ఉందని, 2014 వరకు రూ.3,347 కోట్లు ఖర్చుపెట్టినా అందులో 5 టీఎంసీల నీళ్లు కూడా నింపలేకపోయారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కేవలం 18,700 ఎకరాల భూసేకరణ, 1,448 ఇండ్ల ఆర్ అండ్ ఆర్ మాత్రమే జరిగిందని వివరించారు.
తెలంగాణ వచ్చాక బీఆర్‌ఎస్ ప్రభుత్వం 10 వేల ఎకరాల భూసేకరణ చేసి, 13,296 ఇండ్లు కట్టి పునరావాసం కల్పించిందని తెలిపారు. రూ.2,052 కోట్లు ఖర్చు చేశాక 2016 లోనే ప్రాజెక్టును పూర్తిస్థాయిలో 20 టీఎంసీలు నింపుకునేలా చేశామన్నారు. ఇప్పుడు ఎల్లంపల్లిలో 8 టీఎంసీలు డెడ్‌స్టోరేజ్ తీసేస్తే.. కేవలం 5 టీఎంసీల నీళ్లే ఉన్నాయని పేర్కొన్నారు.
ఎన్టీపీసీకి 5 టీఎంసీలు, సింగరేణికి 5, హైదరాబాద్ తాగునీటికి 10 టీఎంసీలు అవసరమని, సీఎం పంతాలకు పోయి నీళ్లు ఎత్తకపోతే రేపు కరెంట్ ఉత్పత్తి ఆగిపోయి రాష్ట్రం అంధకారం అవుతుందని చెప్పారు. 2014–15లో రాష్ట్రంలో పండిన వరి కేవలం 68 లక్షల టన్నులని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలైన 24 గంటల కరెంట్, రైతుబంధు, సాగునీరు వల్ల 2023–24 నాటికి ఏకంగా 2.60 కోట్ల టన్నుల పంట చేతికొచ్చిందని తెలిపారు. వరి సాగు 34 లక్షల ఎకరాల నుంచి 1.18 కోట్ల ఎకరాలకు పెరిగిందని, ఇది ముమ్మాటికీ కేసీఆర్ ఘనతేనని చెప్పారు.
28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా భద్రాచలానికి ఏమీకాలె
అన్నారంలో 5 టీఎంసీలు, సుందిళ్లలో 3.8 టీఎంసీలు మొత్తం 8.8 టీఎంసీలు నింపితే.. ఒకవేళ రెండు బ్యారేజీలకు ఒకేసారి ఇబ్బంది వచ్చినా కిందికి వెళ్లేది కేవలం 1.10 లక్షల క్యూసెక్కుల నీళ్లేనని హరీశ్‌రావు తెలిపారు. 2022లో ఏకంగా 28 లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే భద్రాచలానికి ఏమీ కాలేదని, అలాంటిది లక్ష క్యూసెక్కులకే భద్రాచలం కొట్టుకుపోతుందని సీఎం చెవిలో పూలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు కొట్టుకుపోయాయని రేవంత్ రెడ్డి పదే పదే అబద్ధాలు చెబుతున్నారని, ప్రాజెక్టుకు ఖర్చు పెట్టిందే రూ. 87 వేల కోట్టేనని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకోసం ఎక్స్‌పర్ట్స్‌ను, ఆర్మీ ఇంజనీర్లను తెచ్చామని గొప్పలు చెబుతున్న రేవంత్‌రెడ్డికి ఏ సీజన్‌లో పనులు చేయాలో తెలియదన్నారు. నాడు ఎంపీగా ఉన్నప్పుడు ఎన్‌డీఎస్‌ఏ చట్టం రాష్ట్రాల హక్కులు కాలరాయడమేనని వ్యతిరేకించి.. రాతపూర్వకంగా ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేడు అదే ఎన్‌డీఎస్‌ఏ బైబిల్‌లాగా కనిపిస్తున్నదని విమర్శించారు.
మోటార్లు బంద్ పెట్టి, నీళ్లు కిందకు వదిలేస్తూ ఆంధ్రాలోని పట్టిసీమకు మేలు చేస్తున్నారన్నారు. ఇది కాంగ్రెస్ పాలన కాదని, గురువు చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఇచ్చుకుంటున్న గురుదక్షిణ అని చెప్పారు. చొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చే రేవంత్ రెడ్డికి తన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
