ఎఫ్‌‌ఎంసీజీ  రంగంలో మొదలైన ఉద్యోగాల కోత

ఎఫ్‌‌ఎంసీజీ  రంగంలో మొదలైన ఉద్యోగాల కోత
  •     సైలెంట్‌‌గా సిబ్బందిని తగ్గించుకుంటున్న టాప్ కంపెనీలు
  •     నియామకాలను ఆపేయడం, కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసేయడం వంటి చర్యలు
  •     ఆటోమేషన్‌‌, ఏఐ వాడకం పెరగడమే  కారణం
  •     ఉన్న ఉద్యోగుల జీతాలను పెంచేందుకు మొగ్గు

న్యూఢిల్లీ:  సబ్బులు, షాంపూలు వంటి నిత్యావసర వస్తువులు తయారు చేసే ఎఫ్‌‌‌‌ఎంసీజీ  కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకోవడం మొదలు పెట్టాయి.  టెక్నాలజీ, ఆటోమేషన్ల వినియోగం పెరుగుతుండడంతో ప్యాకేజింగ్‌‌‌‌, వేర్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌ వంటి వివిధ విభాగాల్లో సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి.  గ్రామాలు, పట్టణాల్లో డిమాండ్  స్థిరంగా ఉండడంతో  భారీ లేఆఫ్స్ కనిపించడం లేదు.  కానీ సైలెంట్‌‌‌‌గా కోతలు పెడుతున్నాయి.   కొత్తగా ఉద్యోగులను తీసుకోకపోవడం, ఉద్యోగం మానేసిన వారి స్థానాలను భర్తీ చేయకపోవడం,  కాంట్రాక్ట్ సిబ్బందిని తగ్గించడం ద్వారా తమ ఖర్చులను నియంత్రిస్తున్నాయి.   ఖర్చులు తగ్గించుకోవడానికి కంపెనీలు 'తక్కువ మంది సిబ్బంది -–- ఎక్కువ టెక్నాలజీ' అనే స్ట్రాటజీకి మొగ్గు చూపుతున్నాయి.  మరోవైపు  ఉన్న ఉద్యోగులకు  మాత్రం జీతాలు  పెంచుతున్నాయి.  దేశీయ ఎఫ్‌‌‌‌ఎంసీజీ  కంపెనీలు విడుదల చేసిన 2025–-26 ఆర్థిక సంవత్సరం యాన్యువల్ రిపోర్ట్‌‌‌‌ల ద్వారా ఈ విషయాలు బయటపడ్డాయి. 

హెచ్‌‌‌‌యూఎల్, డాబర్‌‌‌‌లలో ఉద్యోగాల తగ్గింపు

దేశంలోనే అతిపెద్ద ఎఫ్‌‌‌‌ఎంసీజీ సంస్థ అయిన హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌‌‌‌యూఎల్‌‌‌‌) తన పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించుకుంది. గతేడాది మార్చి 31 నాటికి  6,604 గా ఉన్న ఉద్యోగుల సంఖ్య ఈ ఏడాది మార్చి ముగిసే నాటికి 5,898 కి పడిపోయింది. అంటే దాదాపు 700 మందికి పైగా సిబ్బంది తగ్గారు.   అలాగే మరో  పెద్ద కంపెనీ డాబర్ ఇండియా కూడా తన పర్మినెంట్ వర్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ను 5,343 నుంచి 4,770 కి తగ్గించుకుంది.  570 మందిని తీసేసింది. 

టాటా కన్జూమర్, మారికోలలో నియామకాలు

మరోవైపు, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ (టీసీపీఎల్‌‌‌‌), మారికో, నెస్లే ఇండియా వంటి కంపెనీలు తమ సిబ్బందిని స్వల్పంగా పెంచుకున్నాయి. వివిధ సబ్సిడరీ కంపెనీలను  విలీనం చేసుకోవడంతో  టాటా కన్జూమర్ ఉద్యోగుల సంఖ్య 4,079 నుంచి 4,558 కి పెరిగింది. మారికో  కూడా తన సిబ్బందిని 1,908 నుంచి   1,983 కి విస్తరించింది.

ఆటోమేషన్, ఏఐ  వాడకం..

ఎఫ్‌‌‌‌ఎంసీజీ  రంగంలో ఏఐ, ఆటోమేషన్ వాడకం వేగంగా పెరుగుతోంది.  మొదట్లో  ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉన్నా,  లాంగ్ రన్‌‌‌‌లో ఇది కంపెనీల సామర్థ్యాన్ని పెంచి, ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు  చెబుతున్నాయి. ఎఫ్‌‌‌‌ఎంసీజీ కంపెనీలు తమ  వస్తువుల తయారీ, ప్యాకేజింగ్, వేర్‌‌‌‌హౌస్,  బ్యాక్-ఆఫీస్ నిర్వహణలో ఏఐ, ఆటోమేటెడ్  మిషన్లను పెద్ద ఎత్తున వాడుతున్నాయి. ముఖ్యంగా  సప్లయ్‌‌‌‌ చెయిన్‌‌‌‌,  ఇన్వెంటరీలో ఏఐ వాడకం పెరిగింది. దీంతో  మార్కెట్లో ఏ వస్తువుకు ఎంత డిమాండ్ ఉందో ఏఐ ఆధారిత అనలిటిక్స్ ద్వారా ఒక అంచనాకు రావొచ్చు.  

వేర్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌లలో  వస్తువులు వృథా కాకుండా, అవసరమైనంత స్టాక్ మాత్రమే మెయింటైన్ చేయడానికి వీలవుతోంది. ఇది కంపెనీలకు భారీగా ఖర్చులను మిగులుస్తుంది.    తయారీ ప్లాంట్లలో ఏఐ ఆధారిత రోబోటిక్ సిస్టమ్స్ వల్ల తక్కువ సమయంలో, తక్కువ మంది సిబ్బందితో ఎక్కువ ఉత్పత్తి సాధ్యమవుతోంది.  వినియోగదారులు ఎలాంటి వస్తువులను ఇష్టపడుతున్నారో తెలుసుకోవడానికి, మార్కెట్ ట్రెండ్స్ గమనించడానికి కూడా  ఏఐ టూల్స్ వాడుతున్నారు. కంపెనీలు ఏఐ, ఇంటిగ్రేటెడ్ ఈఆర్‌‌‌‌పీ  సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌లపై చేస్తున్న పెట్టుబడులతో  బ్యాక్-ఆఫీస్, డేటా ఎంట్రీ, లాజిస్టిక్స్ వంటి విభాగాలలో పర్మినెంట్ ఉద్యోగుల అవసరం తగ్గుతోంది.

వేతనాల పెంపులో టాటా టాప్ 

ఉద్యోగుల సగటు జీతాల పెంపులో టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ ముందుంది. 2025–26 లో  12.1 శాతం  హైక్ ఇచ్చింది. డాబర్  7.7 శాతం, నెస్లే ఇండియా 7.3 శాతం, మారికో 6.33 శాతం మేర జీతాలను పెంచగా,  హిందుస్తాన్ యూనిలీవర్ అత్యల్పంగా 6.08 శాతం పెంచి, చివరి స్థానంలో ఉంది.