- ప్రారంభించనున్న కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ
- రాష్ట్ర వ్యాప్తంగా 12,30,183 మంది లబ్ధిదారులకు మేలు
- ఇక్కడి నుంచే వర్చువల్‌గా మరో 5 రాష్ట్రాల్లో మెగా హెల్త్ ప్రాజెక్టుల ప్రారంభం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని సనత్‌నగర్ ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో కొత్త ఓపీడీ విభాగం అందుబాటులోకి రానుంది. మంగళవారం కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ దీనిని ప్రారంభించనున్నారు. అనంతరం ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా రూ.668 కోట్లతో నిర్మించిన ఏడు మెగా ఈఎస్‌ఐసీ ఆరోగ్య ప్రాజెక్టులను వర్చువల్ మోడ్‌లో జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే పాల్గొంటారని ఆదివారం ఒక ప్రకటనలో కేంద్రం వెల్లడించింది. అలాగే, సనత్‌నగర్ ఓపీడీ భవన నిర్మాణ నిర్మాణ కార్మికులను కేంద్ర మంత్రి సత్కరించున్నట్లు తెలిపింది. అనంతరం లబ్ధిదారులకు అక్కడికక్కడే నగదు ప్రయోజనాలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది.
12,30,183 మందికి లబ్ధి...
ఈ నూతన ఓపీడీ ప్రారంభంతో హైదరాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని కార్మికులకు మేలు జరగనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ జిల్లాల పరిధిలోని దాదాపు 12,30,183 మంది బీమాదారులు, వారి కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరనున్నట్లు తెలిపింది. కాగా, దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్న ఏడు ప్రాజెక్టుల్లో ఏపీలోని రాజమహేంద్రవరం ఈఎస్‌ఐఎస్ ఆసుపత్రి (26 ఓపీడీ గదులు, 3 ఆధునిక మాడ్యులర్ థియేటర్లు) కూడా ఉంది. ఈ హాస్పిటల్ కింద మొత్తం 2,52,717 మందికి సేవలు అందనున్నాయి.
అత్యాధునిక ఓపీడీ...
రూ.211.13 కోట్లతో 43,611.04 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో ఈ భారీ భవనాన్ని నిర్మించారు. ఇందులో జనరల్ మెడిసిన్, ఈఎన్టీ, డెంటల్, గైనకాలజీ, నేత్ర, ఆర్థోపెడిక్స్, సైకియాట్రీ, చర్మ, ఊపిరితిత్తుల, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీలతో పాటు ఆయుష్ ఓపీడీలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 180 సాధారణ పడకలు (మూడు 60 పడకల వార్డులు), 25 ఐసీయూ పడకలు, 20 ఎన్‌ఐసీయూ పడకలతో దీన్ని నిర్మించారు. అంతేకాకుండా ఫిజికల్ మెడిసిన్, రేడియాలజీ, యోగా కేంద్రం, అధునాతన మందుల దుకాణం, క్లినికల్ లెక్చర్ థియేటర్ వంటి అదనపు వసతులు ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి.
