డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తూనే, గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ‘శివం భజే’ చిత్రంతో నిర్మాతగా మారారు మహేశ్వర్ రెడ్డి మూలి. ఆయన నిర్మించిన రెండో చిత్రం ‘ఓ సుకుమారి’. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా భరత్ దర్శన్ రూపొందించిన ఈ సినిమా జులై 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ‘ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. దర్శకుడు భరత్ దర్శన్ చెప్పిన కథ నచ్చడంతో దాదాపు ఏడాది పాటు స్క్రిప్ట్‌పై వర్క్ చేశాం. ఇందులో హీరోయిన్‌ను ముట్టుకుంటే షాక్ కొట్టడం అనే యూనిక్ కాన్సెప్ట్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.
ఈ పాయింట్ చుట్టూనే సినిమా అంతా ఉంటుంది. ఇందులో చూపించిన షాక్ సమస్యకు ఒక లాజిక్ కూడా ఉంటుంది. నిజానికి ప్రతి మనిషి శరీరంలో ఎలక్ట్రిక్ ఎనర్జీ ఉంటుంది. అయితే అది ఒక్కొక్కరిలో ఒక్కో స్థాయిలో ఉంటుంది. అదే అంశాన్ని కథలో ఆసక్తికరంగా చూపించాం. ఈ కథకు తిరువీర్, ఐశ్వర్య రాజేష్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్, ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి. ప్రేక్షకులు టికెట్‌కు పెట్టిన ప్రతి రూపాయికి పూర్తి స్థాయి వినోదం పొందేలా సినిమాను రూపొందించాం. ఐశ్వర్య రాజేష్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. ఇక తిరువీర్‌తో మరో సినిమా, అలాగే సత్యదేవ్‌తో కొత్త మూవీ ప్లాన్ చేస్తున్నా’ అని చెప్పారు.
