గండిపేట, వెలుగు: బాలికతో ప్రధాన రహదారిపై కారు నడిపించిన ఓ పోలీసు అధికారి వ్యవహారం గంధంగూడ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. గంధంగూడ నుంచి బైరాగిగూడ వెళ్లే ప్రధాన రహదారిపై ఆదివారం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనికి కారణమైన స్విఫ్ట్ కారును పరిశీలించగా, స్టీరింగ్ వద్ద ఓ మైనర్ బాలిక డ్రైవింగ్ చేస్తూ కనిపించింది. దీంతో కొందరు స్థానికులు కారును ఆపి ప్రశ్నించగా, కారులో ఉన్న బాలిక, ఆమెతో పాటు ఉన్న పోలీసు అధికారి వారితో వాగ్వాదానికి దిగారు.
మైనర్‌తో వాహనం నడిపించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తులే నిబంధనలను ఉల్లంఘిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత పోలీసు అధికారుల నుంచి అధికారిక స్పందన రాలేదు. వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
