- సైబర్ క్రిమినల్స్ వేటతోపాటు ఇన్వెస్టిగేషన్లో కీ రోల్
- దేశంలో ఎక్కడ సైబర్ నేరం చేసినా పట్టేసే టెక్నాలజీ
- సైబర్ క్రైమ్ పోలీసులకు సొంత ఏఐ ఆఫ్‌లైన్ వెపన్ రెడీ
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్ల ఆట కట్టించడానికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) సరికొత్త సాంకేతికతను రంగంలోకి దించింది. సైబర్ నేరగాళ్లు దేశంలో ఎక్కడ దాక్కున్నా ఇట్టే పట్టేసేందుకు ‘ఇంట్రా జీపీటీ’అనే సరికొత్త ఆఫ్‌లైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని రూపొందించింది. ఈ అధునాతన ఏఐ వ్యవస్థ పోలీస్ సెక్యూరిటీ నెట్‌వర్క్‌లో సొంతంగా పనిచేస్తుంది. గతంలో జరిగిన సైబర్ నేరాలు, ఆర్థిక నేరగాళ్లకు సంబంధించిన ఏండ్ల తరబడి డేటాను నిమిషాల్లో స్కాన్ చేస్తుంది.
సుదీర్ఘమైన పాత ఫైళ్లను చేతితో వెతకాల్సిన అవసరం లేకుండా, కేవలం ఒక్క క్లిక్‌తో కేసుల పూర్తి హిస్టరీని సెకన్ల వ్యవధిలోనే దర్యాప్తు అధికారుల కళ్ల ముందుకు తెస్తుంది. దేశంలో ఎలాంటి సైబర్ నేరం జరిగినా.. నేరగాళ్ల ప్రొఫైల్స్, వారు వాడిన బ్యాంక్ అకౌంట్లు, ఫోన్ నంబర్లను వేలిముద్రలను పసిగట్టి అధికారులకు అందిస్తుంది.
డేటా లీకయ్యే ఛాన్సే లేదు
ఇంట్రా జీపీటీ టెక్నాలజీ ద్వారా కేసుల దర్యాప్తు వివరాలతో పాటు పౌరుల సమాచారం కూడా డిపార్ట్మెంట్ సర్వర్లలోనే సురక్షితంగా దాగి ఉంటుంది. ఇది పాత కేసులను రీఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులకు ఎంతో సహాయపడుతుంది. అధికారులు సంక్లిష్టమైన సమాచారాన్ని కూడా చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు. సున్నితమైన సమాచారంలో ఒక్క బైట్ డేటా కూడా పోలీస్ సెక్యూరిటీ నెట్వర్క్ నుంచి బయటకు వెళ్లకుండా ఒక ప్రత్యేక మాడ్యూల్‌ను డిజైన్ చేశారు. దీనివల్ల డేటా లీక్ అయ్యే ప్రమాదం అస్సలు ఉండదు. మోడల్స్, క్వెరీలు, రికార్డులు అన్నీ పోలీసుల నియంత్రణలోనే ఉంటాయి. సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో అంతర్గత ఏఐ వినియోగానికి సంబంధించి ఇంట్రాజీపీటీ అనేది దేశంలోనే మొట్టమొదటి టెక్నాలజీ కావడం విశేషం.
క్షణాల్లో సైబర్ మోసాల మూలాలు బ్రేక్: శిఖాగోయల్
గోప్యతను, ప్రజా విశ్వాసాన్ని కాపాడుతూనే సైబర్ పెట్రోలింగ్ కోసం ఇంట్రా జీపీటీ ఏఐ సాధనాలను వాడుతున్నామని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ తెలిపారు. ఇంటర్నెట్లో చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను గుర్తించడానికి, సైబర్ బెదిరింపుల ఆధారంగా కేసుల తీవ్రతను అంచనా వేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని ఆమె వెల్లడించారు. కొత్త టెక్నాలజీ వల్ల దేశంలో ఎక్కడ సైబర్ మోసం జరిగినా.. దానికి సంబంధించిన మూలాలను తెలంగాణ పోలీసులు క్షణాల్లో చేధించగలుగుతున్నారు. ఈ విప్లవాత్మక మార్పుతో సాధారణ ప్రజల సొమ్మును దోచుకునే సైబర్ దొంగలకు ఇకపై చెక్ పడనుంది.
