హసన్ పర్తి, వెలుగు: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీజీ సీపీగెట్-2026 ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షలు ఐదో రోజు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయని కన్వీనర్ ప్రొఫెసర్ రాజేందర్ కట్ల తెలిపారు. ఉదయం సెషన్‌లో ఎం.ఎస్‌సి. (జువాలజీ), ఎం.ఏ. (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) కోర్సులకు 4,088 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 3,601 మంది పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌లో ఎం.ఏ. (సంస్కృతం, ఉర్దూ, హిందీ) కోర్సులకు 366 మంది నమోదు చేసుకోగా, 315 మంది పరీక్ష రాశారు.
సాయంత్రం సెషన్‌లో ఎం.ఎస్‌సి. (జియాలజీ), ఎం.ఏ. (ఫిలాసఫీ) కోర్సులకు 399 మంది నమోదు చేసుకోగా, 312 మంది హాజరయ్యారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు కన్వీనర్ తెలిపారు. జులై 13న ఉదయం ఎం.ఏ. (ఇంగ్లిష్), మధ్యాహ్నం ఎం.ఎస్‌సి. (ఫిజిక్స్), సాయంత్రం ఎం.ఏ. (లింగ్విస్టిక్స్), ఎం.ఎడ్. కోర్సుల ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
