- స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రకటన
ధర్మసాగర్, వెలుగు : తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ దేవాదుల ఎత్తిపోతల పథకం కింద రైతులకు సాగునీరు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని, 15 రోజుల్లో నీటిని విడుదల చేస్తామని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. గోదావరి ఎత్తిపోతల పథకం కింద ధర్మసాగర్ రిజర్వాయర్ లోకి నీటి పంపింగ్ ను ఆదివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా గోదావరి జలాలకు పూజలు చేశారు. ప్రస్తుతం ఎన్ని పంపులు నడుస్తున్నాయి, ఇంకా పంపింగ్ చేయాల్సిన మోటార్లు ఎన్ని అనే విషయాలపై ఆఫీసర్లతో చర్చించారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ... వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు ఆరుతడి పంటలే సాగు చేసుకోవాలని, ఒకవేళ వరి సాగు చేయాల్సి వస్తే ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి పాటించాలని సూచించారు.
నెల రోజుల్లో ధర్మసాగర్, స్టేషన్ ఘనపూర్, నవాబ్ పేట, అశ్వరావుపల్లి, చీటకోడూరు, బొమ్మకూరు రిజర్వాయర్లు నింపేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. సీఈ సుధీర్, ఎస్ఈ సీతారాం, జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, ధర్మసాగర్ మండల అధ్యక్షుడు పెసరు రమేశ్ పాల్గొన్నారు.
