- అంబర్‌పేట్ డివిజన్లలో కేంద్రమంత్రి పాదయాత్ర
అంబర్‌పేట్, వెలుగు: హైదరాబాద్‌లోని బస్తీల్లో మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కూడా హైటెక్ సిటీ అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తోందని, పేదలు, మధ్యతరగతి ప్రజలు ఉండే ప్రాంతాలను పట్టించుకోవడం లేదన్నారు. ఆదివారం అంబర్‌పేట్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో అధికారులు, బీజేపీ నాయకులు, స్థానికులతో కలిసి కిషన్రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. బస్తీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, వీధి దీపాలు వెలగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చాలా రోడ్లు పాడైపోయినా మరమ్మతులు చేయడం లేదని విమర్శించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చాలా కాలమైనా అర్హులకు ఇళ్లు, పెన్షన్లు ఇవ్వలేదన్నారు. మహిళలకు నెలకు రూ.2,500, నిరుద్యోగులకు రూ.4 వేల భృతి, అమ్మాయిలకు స్కూటీలు, పెళ్లికి తులం బంగారం వంటి హామీలను అమలు చేయాలని ప్రజలు అడుగుతున్నారని చెప్పారు.
క్లైమేట్ మార్పుల వల్ల వర్షాలు తగ్గుతున్నాయని, దీని ప్రభావం దేశంపై కనిపిస్తోందన్నారు. వర్షాలు తగ్గితే పంటలు దెబ్బతినడంతో పాటు తాగునీటి సమస్య కూడా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఇప్పుడే నీటి కష్టాలు మొదలయ్యాయని, ప్రభుత్వం వెంటనే తాగునీటి సమస్యపై స్పష్టమైన ప్రణాళిక తీసుకురావాలని సూచించారు. హైదరాబాద్ వేగంగా విస్తరిస్తున్నా, దానికి తగ్గట్టు మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ విఫలమయ్యాయని ఆరోపించారు.
డ్రైనేజీ, రోడ్లు, స్వచ్ఛత వంటి అంశాల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి నగరంపై కంటే, ప్రభుత్వ భూముల వేలం, వ్యాపారాల పైనే ఎక్కువ శ్రద్ధ ఉందని ఆరోపించారు. ఎస్బీఐ వంటి సంస్థలు వద్దన్నా వినకుండా భూములను వేలం వేస్తున్న ప్రభుత్వం, నగర ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యపై, స్ట్రీట్ లైట్ల నిర్వహణపై దృష్టి పెట్టడం లేదని ధ్వజమెత్తారు.
