- ‘కంపాషన్ వితౌట్ బారియర్స్’
- పేరిట 30 మందికి ఉపాధి..
- స్టాఫ్‌కు అర్థమయ్యేలాసైన్ లాంగ్వేజ్‌లో శిక్షణ
హైదరాబాద్ సిటీ, వెలుగు : మాట, వినికిడి లోపం ఉన్న వారికి ఉద్యోగాలు దొరకడం అంత సులభం కాదు. వారి సామర్థ్యాన్ని గుర్తించే అవకాశాలు కూడా చాలా అరుదు. అయితే, బధిరుల విషయంలో జూబ్లీహిల్స్అపోలో దవాఖాన యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని అక్కడికి వెళ్తున్న పేషెంట్లు, అటెండర్లు అభినందిస్తున్నారు. సరైన అవకాశాలు, ప్రోత్సాహం అందిస్తే బధిరులు కూడా తమను తాము నిరూపించుకోగలరని ‘అపోలో’ చేసి చూపించింది. మూగ, బధిర దివ్యాంగులకు ఉపాధి కల్పించి వారి కుటుంబాలకు అండగా నిలిచింది. చెవులు వినిపించకున్నా.. మాటలు రాకున్నా పని చేయాలనే సంకల్పం ఉన్న వారిని గుర్తించి ఫుడ్ అండ్ బెవరేజెస్ డిపార్ట్‌మెంట్, పేషెంట్లను వీల్చైర్లు, స్ట్రెచర్లపై తరలించడం లాంటి పనులు చేయిస్తూ మానవత్వాన్ని చాటుతోంది. 2025 జులైలో కంపాషన్ వితౌట్ బారియర్స్ అనే నినాదంతో శారీరక సవాళ్లు ఎదుర్కొంటున్న 30 మందికి హాస్పిటల్ లో ఉద్యోగావకాశాలు కల్పించింది.
‘సైన్ లాంగ్వేజ్’లో శిక్షణ
30 మందిని సెలెక్ట్చేసుకున్నాక వారు భాష విషయంలో, అర్థం చేసుకోవడంలో సమస్యలు అధిగమించడానికి, పనులు ఎలా చేయాలో చెప్తూ శిక్షణ ఇచ్చారు. అలాగే, బధిరులతో హాస్పిటల్స్టాఫ్మాట్లాడడానికి ఇబ్బందులు పడకూడదని మేనేజర్లు, సూపర్ వైజర్లు, ఇతర సిబ్బందికి ప్రత్యేకంగా ‘సైన్ లాంగ్వేజ్’ (సంకేత భాష) లో ట్రైనింగ్ ఇప్పించారు. రోగులకు ఫుడ్ఎలా పెట్టాలి? ఒక విభాగం నుంచి మరో విభాగానికి పేషెంట్లను ఎలా తీసుకువెళ్లాలి? ఏ విభాగం ఎక్కడ ఉంటుంది? అన్న విషయాలన్నీ అర్థమయ్యేలా వివరించారు.
ఇప్పుడు వీరంతా రోగుల అవసరాన్ని గుర్తించడం, అటెండర్ చెప్పిన చోటికి అంటే ఎక్స్ రే, సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ, ఆపరేషన్ థియేటర్ ఇలా అన్ని ప్రాంతాలకు వీల్ చైర్లు, స్ట్రెచర్ లపై తీసుకువెళ్తున్నారు. పేషెంట్ల బంధువులకు సైన్లాంగ్వేజ్రాకపోయినా రాసి చూపించడం, వారి పెదాల కదలికల ఆధారంగా అర్థం చేసుకుని సాయం చేస్తున్నారు.
