నేడు (జూలై 13) కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం

నేడు (జూలై 13) కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం
  • హాజరుకానున్న తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల అధికారులు

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సోమవారం కీలక సమావేశం నిర్వహించనుంది. జల వనరులు, నదీ అభివృద్ధి, గంగా పునరుజ్జీవ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జలవనరుల శాఖ అత్యున్నత కార్యదర్శుల అఖిల భారత సదస్సు’లో వివిధ రాష్ట్రాల జల వనరుల శాఖల సెక్రటరీలు పాల్గొననున్నారు. ఢిల్లీలో జరగనున్న ఈ సదస్సుకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షుడిగా, జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి, కార్యదర్శి బీఎల్ కాంతారావు సహ అధ్యక్షులుగా వ్యవహరించనున్నారు.

సుస్థిర జలవనరుల నిర్వహణ, కేంద్ర-, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆదివారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ సదస్సులో  రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జలవనరుల శాఖల అధికారులతోపాటు, సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ), నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ), నేషనల్ వాటర్ మిషన్  సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నట్టు  వెల్లడించింది. జలవనరుల రంగంలో సంస్కరణలను వేగవంతం చేయడానికి, రాష్ట్రాలు తమ అనుభవాలను పంచుకోవడానికి ఈ సదస్సు అవకాశాన్ని కల్పిస్తుందని కేంద్రం అభిప్రాయపడింది.