సీఈవో అధికారాలు ట్రస్టే నిర్ణయిస్తుంది.. రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా

సీఈవో అధికారాలు ట్రస్టే నిర్ణయిస్తుంది.. రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా

అయోధ్య: అయోధ్య రామాలయానికి నియమించనున్న తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) అధికారాలు, బాధ్యతలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టే నిర్ణయిస్తుందని రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా స్పష్టం చేశారు. ట్రస్టు కార్యకలాపాల్లో, సీఈఓ విధుల్లో ప్రభుత్వ జోక్యం ఉండదని ఆయన తెలిపారు. మిశ్రా ఆదివారం అయోధ్యలో మీడియాతో మాట్లాడుతూ.. సీఈఓ పూర్తిగా ట్రస్ట్‌‌‌‌‌‌‌‌కు సహాయకుడిగా వ్యవహరిస్తారన్నారు. 

సీఈఓకు ఎంత మేర అధికారాలు అప్పగించాలనేది పూర్తిగా ట్రస్ట్ ఇష్టంపై ఆధారపడి ఉంటుందన్నారు. అయోధ్యకు వచ్చే భక్తుల విశ్వాసాన్ని కాపాడటమే సీఈఓ ప్రాథమిక విధి అని పేర్కొన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతను సీఈవో నిర్వహిస్తారని వివరించారు. ట్రస్టు ఆధ్వర్యంలోనే ఆయన పనిచేస్తారన్నారు. అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకునే అధికారం సీఈఓకు ఉంటుందని మిశ్రా తెలిపారు. సీఈఓ నియామకానికి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి ట్రస్టుకు సిఫారసు చేసేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు మిశ్రా స్పషం చేశారు.