రామయ్య విరాళాల చోరీపై ఆప్ ఉద్యమం..దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ

రామయ్య విరాళాల చోరీపై ఆప్ ఉద్యమం..దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ

న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిరం విరాళాల వ్యవహారంపై రాజకీయ వేడి పెరిగింది. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ ప్రారంభించింది. ఢిల్లీలోని రోహిణి జపనీస్ పార్కులో ఆదివారం సుందరకాండ పారాయణంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. విరాళాల వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు పంపుతున్నామని చెప్పారు. 

రామభక్తులు ఆ లేఖలపై సంతకాలు చేసి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇళ్లలో, కాలనీల్లో హనుమాన్ చాలీసా పారాయణాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరచాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యవహారంలో తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఆప్ చర్యలను ఢిల్లీ బీజేపీ తప్పుబట్టింది. కేజ్రీవాల్ రాజకీయ లాభం కోసం సుందరకాండ పారాయణాలను ఉపయోగిస్తున్నారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు హర్ష్ మల్హోత్రా విమర్శించారు. 2024లో ప్రకటించిన సుందరకాండ పారాయణాలను తర్వాత ఎందుకు కొనసాగించలేదని కేజ్రీవాల్​ ప్రశ్నించారు.