న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ ఫార్మలైజేషన్ స్కీమ్(పీఎంఎఫ్‌ఎమ్‌ఈ) కింద ఇప్పటికే రెండు లక్షల చిన్న పరిశ్రమలకు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ అందించామని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాశ్వాన్ వెల్లడించారు.
2020లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా రూ.20,300 కోట్ల ఉమ్మడి పెట్టుబడితో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే రూ.ఆరు వేల కోట్ల సబ్సిడీని అందించారు. ఫలితంగా దాదాపు 11 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించాయి.
లబ్ధిదారులలో దాదాపు 90 శాతం మంది మొదటి తరం పారిశ్రామికవేత్తలు కాగా, 44 శాతం మంది మహిళలు ఉన్నారు. 75 వేల కంటే ఎక్కువ సంస్థలు ఉద్యమ్, ఎఫ్ఎస్ఎస్ఏఐ, జీఎస్టీ రిజిస్ట్రేషన్ల ద్వారా అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశించాయి. ఈ పథకం ద్వారా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలకు 35 శాతం సబ్సిడీ లభిస్తుంది. పీఎంఎఫ్‌ఎమ్‌ఈను ఈ ఏడాది సెప్టెంబర్ వరకు పొడిగించారు.
