గంభీర్ ప్రయోగాలు ఫెయిల్?.. చరిత్రలోనే తొలిసారి 0 –4తో సిరీస్ కోల్పోయిన భారత్!

గంభీర్ ప్రయోగాలు ఫెయిల్?.. చరిత్రలోనే తొలిసారి 0 –4తో సిరీస్ కోల్పోయిన భారత్!

Gautam Gambhirs: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో భారత్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతటి అత్యంత ఘోరమైన పీడకలను ఎదుర్కొంటోంది. టెస్ట్ క్రికెట్‌లో స్వదేశంలోనే న్యూజిలాండ్ (0–3), దక్షిణాఫ్రికా (0–2) జట్ల చేతిలో వైట్‌వాష్‌కు గురైన టీమిండియా.. ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లోనూ పూర్తిగా అగాధంలోకి పడిపోయింది. యూరప్ పర్యటనలో మొదట ఐర్లాండ్ చేతిలో 0–2తో క్లీన్ స్వీప్ అవ్వడమే కాదు, తాజాగా ఇంగ్లండ్ చేతిలో 4–0తో ఘోర పరాజయాన్ని చవిచూసింది. లక్ కలిసివచ్చి కెప్టెన్ అయ్యర్ వరుసగా 7 మ్యాచ్‌ల్లో టాస్ గెలిచినా.. మైదానంలో మాత్రం ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయాడు.  

అగ్రస్థానానికి ఇంగ్లండ్ జెండా:
ఈ వరుస పరాజయాలు కేవలం సిరీస్ ఓటములకే పరిమితం కాలేదు, సుదీర్ఘకాలంగా టీ20 సామ్రాజ్యాన్ని ఏలుతున్న భారత్.. దాదాపు నాలుగున్నరేళ్ల (1605 రోజుల) తర్వాత అంతర్జాతీయ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో తన నెంబర్ వన్ స్థానాన్ని అధికారికంగా కోల్పోయింది. శనివారం సౌతాంప్టన్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో విజయం సాధించడంతో హ్యారీ బ్రూక్ సేన 4–0తో సిరీస్ నెగ్గడమే కాకుండా, వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన ఇండియాని వెనక్కి నెట్టి ప్రపంచ నంబర్ వన్ పీఠాన్ని హస్తగతం చేసుకుంది. 

సౌతాంప్టన్‌లో తేలిపోయిన ఇండియా: 
సిరీస్ ప్రారంభంలో బ్యాటర్లదే తప్పని భావించినప్పటికీ, సౌతాంప్టన్ వేదికగా జరిగిన లాస్ట్ మ్యాచ్ టీమిండియా బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలను పూర్తిగా బయటపడింది. జోస్ బట్లర్ (131), హ్యారీ బ్రూక్ (95*) కలిసి రెండో వికెట్‌కు 233 రన్స్ రికార్డు భాగస్వామ్యంతో భారత బౌలింగ్ ని చెడుగుడు ఆడారు. వీరికి తోడుగా ఇండియా ఫీల్డర్లు కూడా క్యాచ్‌లు చేజార్చి ఇంగ్లండ్‌కు 257 పరుగులు కొట్టింది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మలు హాఫ్ సెంచరీలతో పోరాడినా 201 పరుగులకే ఇండియా పరిమితమై 56 రన్స్‌తో మ్యాచ్‌ను, ర్యాంకింగ్‌ను చేజార్చుకుంది. 

►ALSO READ | సెమీస్ షెడ్యూల్ ఫిక్స్.. వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌లో హై వోల్టేజ్ మ్యాచ్‌లు ఇవే!

గంభీర్ ప్రయోగాలు ఫెయిల్?: 
2026 టీ20 ప్రపంచ కప్ గెలిచినప్పటికీ, సూర్యకుమార్ యాదవ్‌ను బ్యాటింగ్ ఫామ్ సాకుతో కెప్టెన్సీ నుంచి తొలగించి శ్రేయస్ అయ్యర్‌కు బాధ్యతలు ఇవ్వడం మొదటి సిరీస్‌లోనే బెడిసి కొట్టింది. బుమ్రా, హార్దిక్ లేకపోయినా ఐపీఎల్ స్టార్లతో కూడిన ఈ జట్టు ఇలా వరుసగా 6 టీ20ల్లో ఓడిపోవడం ఫ్యాన్స్‌కు మింగుడుపడట్లేదు.. గంభీర్ ఈ వైఫల్యాలను పరివర్తన దశ (Transition Phase) అని సమర్థించుకోవచ్చు, కానీ టెస్టుల్లో రెండు ఘోర వైట్‌వాష్‌ల తర్వాత టీ20ల్లోనూ ఇలాంటి ఫలితాలు రావడంతో అతని కోచింగ్ సామర్థ్యంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి.