- 4-0తో సిరీస్ సొంతం దంచికొట్టిన బట్లర్, బ్రూక్
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియాకు ఘోర పరాజయం మిగిలింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఒక్కటి కూడా గెలవలేకపోయింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లోనూ 56 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. దాంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను హోమ్ టీమ్ 4-0తో సొంతం చేసుకుంది.
సౌతాంప్టన్: ఇంగ్లండ్ గడ్డపై టీమిండియాకు ఘోర పరాజయం మిగిలింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఒక్కటి కూడా గెలవలేకపోయింది. జోస్ బట్లర్ (64 బాల్స్‌లో 12 ఫోర్లు, 8 సిక్స్‌లతో 131), హ్యారీ బ్రూక్ (45 బాల్స్‌లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95 నాటౌట్) దంచికొట్టుడును ఆపలేకపోయిన ఇండియా.. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లోనూ 56 రన్స్ తేడాతో ఓటమిపాలైంది.
దాంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను హోమ్ టీమ్ 4–0తో సొంతం చేసుకుంది. టాస్ ఓడిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 257/3 స్కోరు చేసింది. తర్వాత ఇండియా 20 ఓవర్లలో 201/8 స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ (56), తిలక్ వర్మ (53) రాణించినా ప్రయోజనం దక్కలేదు. బట్లర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, బ్రూక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
రికార్డు భాగస్వామ్యం..
రెండో ఓవర్‌లోనే ఫిల్ సాల్ట్ (6)ను ఔట్ చేసి ప్రసిధ్ కృష్ణ (1/38) శుభారంభాన్నిచ్చినా.. బట్లర్, బెథెల్ ఇండియా బౌలింగ్‌ను ఉతికేశారు. భారీ సిక్సర్లు, ఫోర్లతో స్కోరు బోర్డును పరుగెత్తించారు. ఇంగ్లండ్ పవర్‌ప్లేలో 61/1 స్కోరు చేసింది. ఫీల్డింగ్ పెరిగిన తర్వాత కూడా ఈ ఇద్దరు దూకుడును తగ్గించలేదు. 10వ ఓవర్‌లో బ్రూక్ 6, 6, 4తో 19 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో ఇంగ్లండ్ 111/1తో ఫస్ట్ టెన్ ఓవర్స్‌ను ముగించింది. ఇక్కడి నుంచి బట్లర్ జోరందుకున్నాడు. వరుస ఫోర్లతో 35 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. సూర్యాన్ష్ షెడ్జే వేసిన 14వ ఓవర్‌లో బ్రూక్ 6, 4, 6తో 24 రన్స్ దంచాడు. తర్వాతి ఓవర్‌లో ప్రిన్స్ యాదవ్‌కు బట్లర్ 4, 6, 6, 4తో చుక్కలు చూపించాడు. దాంతో 15 ఓవర్లలో స్కోరు 189/1కి చేరింది.
16వ ఓవర్‌లో అక్షర్ పటేల్‌కు 6, 6, 4తో స్వాగతం పలికిన బట్లర్ కేవలం 17 బాల్స్‌లోనే రెండో ఫిఫ్టీని పూర్తి చేశాడు. ఈ క్రమంలో బట్లర్ ఇచ్చిన క్యాచ్‌ను ఎక్స్‌ట్రా కవర్స్‌లో అక్షర్ పటేల్ డ్రాప్ చేసి మూల్యం చెల్లించుకున్నాడు. 19వ ఓవర్‌లో 6, 6, 4తో విరుచుకుపడిన బట్లర్‌కు శివమ్ దూబే (2/22) చెక్ పెట్టాడు. దాంతో రెండో వికెట్‌కు 233 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ రికార్డు భాగస్వామ్యం. తర్వాతి బాల్‌కే జాకబ్ బెథెల్ (0) కూడా వెనుదిరిగినా విల్ జాక్స్ (7 నాటౌట్) సిక్స్‌తో ఖాతా తెరిచాడు. లాస్ట్ ఓవర్‌లో బ్రూక్ ఫోర్‌తో ఇంగ్లండ్ భారీ స్కోరు నమోదు చేసింది.
బ్యాటర్లు ఫెయిల్..
ఛేజింగ్‌లో ఇండియాకు మెరుగైన ఆరంభం దక్కలేదు. సంజూ శాంసన్ (27) రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో ఖాతా తెరిచినా.. మూడో ఓవర్‌లోనే అభిషేక్ శర్మ (3) పెవిలియన్‌కు చేరాడు. దాంతో 25/1 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ మూడు ఫోర్లతో ఆట మొదలుపెట్టాడు. ఐదో ఓవర్‌లో 6, 4 దంచాడు. కానీ ఆరో ఓవర్‌లో శాంసన్ ఔట్‌తో రెండో వికెట్‌కు 30 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. వచ్చీ రాగానే శ్రేయస్ అయ్యర్ (28) 4, 4 కొట్టడంతో పవర్‌ప్లేలో ఇండియా 65/2 స్కోరు చేసింది. తర్వాత ఇషాన్ వరుసగా ఫోర్లు కొట్టాడు. తర్వాతి నాలుగు ఓవర్లలో 45 రన్స్ రావడంతో తొలి 10 ఓవర్లలో స్కోరు 110/2గా మారింది.
అయితే 11వ ఓవర్‌లో శ్రేయస్ ఔట్ కావడంతో మూడో వికెట్‌కు 55 రన్స్ జతయ్యాయి. ఇదే టైమ్‌లో ఇషాన్ 27 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. కానీ 13వ ఓవర్‌లో ఆదిల్ రషీద్ (1/19)కు వికెట్ ఇచ్చుకున్నాడు. ఎదుర్కొన్న తొలి బాల్‌కే శివమ్ దూబే (14) క్యాచ్ ఔట్ నుంచి బయటపడగా, తిలక్ 4, 6తో జోరు పెంచాడు. ఆ వెంటనే రెండు ఫోర్లు కొట్టిన దూబే వెనుదిరిగాడు. సూర్యాన్ష్ షెడ్డే (7)తో కలిసి తిలక్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేదు. చేయాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉండటంతో ఇండియాకు ఓటమి తప్పలేదు.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్: 20 ఓవర్లలో 257/3 (బట్లర్ 131, బ్రూక్ 95*, దూబే 2/22). ఇండియా: 20 ఓవర్లలో 201/8 (ఇషాన్ 56, తిలక్ వర్మ 53, సామ్ కరన్ 3/36).
