షిఫ్ట్ ఏదైనా ఫిట్నెస్లో నో చేంజ్!

షిఫ్ట్ ఏదైనా ఫిట్నెస్లో నో చేంజ్!

హైటెక్ ​సిటీలో కొత్తగా నైట్ సైక్లింగ్ ట్రెండ్​ నడుస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇప్పుడు ఈ ట్రెండ్​ బాగా ఫాలో అవుతున్నారు టెకీలు​. షిఫ్ట్​లు మారినా.. ఫిట్​నెస్​ మెయింటెయిన్​ చేయొచ్చు అంటున్నారు వాళ్లు. ఏ టైమ్​ అయినా సరే.. సైక్లింగ్​ చేయకుండా ఇంటికెళ్లరు అని నిర్వాహకులు చెప్తున్నారు.

రాత్రిపూట ట్రాఫిక్ తక్కువగా ఉండటం, ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల చాలామంది సైక్లింగ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పక్కన నార్సింగి దగ్గర ఉన్న సోలార్- కవర్డ్ సైక్లింగ్ ట్రాక్, హుస్సేన్ సాగర్ నెక్లెస్ రోడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రోడ్లు సైక్లింగ్ చేయడానికి అనువుగా ఉన్నాయి. కొన్ని సైక్లింగ్ గ్రూపులు ఐటీ ఉద్యోగుల కోసం గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో గైడెడ్ నైట్ రైడ్స్ ఈవెంట్లు నిర్వహిస్తున్నాయి.

దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద నార్సింగి సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సౌర విద్యుత్ పైకప్పు సైక్లింగ్ ట్రాక్ 23 కిలో మీటర్ల పొడవు ఉంటుంది. ఈ ట్రాక్ పక్కనే స్మార్ట్ బైక్ స్టేషన్.. 24/7 అందుబాటులో ఉంటుంది. సైక్లింగ్ చేసే వాళ్లు తమ ఫోన్లలో ఉన్న స్మార్ట్ బైక్ యాప్​లో సాధారణ పెడల్ సైకిళ్లు, ఎలక్ట్రిక్ సైకిల్, ఎలక్ట్రిక్ ఈ– బైక్​లను బుక్ చేసుకోగానే బైక్ స్టేషన్​లో సైకిల్ స్మార్ట్ బైక్ తాళాలు ఆటోమెటిక్​గా తెరుచుకుంటాయి. ఐటీ ఉద్యోగులు రాత్రివేళ సైకిళ్లతో నార్సింగ్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్​పై గ్రూప్ రైడింగ్ చేస్తూ కనిపిస్తారు. పెడల్ సైకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గంటకు రూ.80, ఈ-– బైక్​కు రూ.100, అరగంటకు 59 రూపాయలు చార్జీలు ఉన్నాయి.

‘‘ఐటీ ఉద్యోగులు డే, నైట్​ ఏ షిఫ్ట్​లో పనిచేసిన వాళ్లైనా.. ఆఫీస్​ అయిపోయాక ఇంటికి వెళ్లే ముందు కాసేపు గ్రూప్ సైక్లింగ్ చేయడం వాళ్లకు  అలవాటైపోయింద’’ని స్మార్ట్ బైక్ స్టేషన్ జీఎం మామిడి శ్రవణ్ కుమార్ చెప్పారు.‘‘కంప్యూటర్ల ముందు గంటల తరబడి పనిచేసిన వాళ్లు శారీరక, మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడానికి సైక్లింగ్ బెస్ట్​ రిలాక్సేషన్​గా ఫీలవుతున్నారు. సైక్లింగ్ చేయడం వల్ల వ్యాయామంతోపాటు మానసిక ప్రశాంతత లభిస్తుంద’’ని సీనియర్ టెక్కీ బొజెండ్ల నరేష్ బాబు చెప్పారు.

విస్తరిస్తున్న సైక్లింగ్ సవారీ
సిటీలో వేగంగా విస్తరిస్తున్న సైక్లింగ్ కమ్యూనిటీతో వివిధ క్లబ్​లలో సభ్యుల సంఖ్య పదివేల మందికి పైగా పెరిగిందని హైదరాబాద్ బైసైకిల్ మేయర్ సంతాన సెల్వన్ చెప్పారు. హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్, బైక్ హాలిక్స్, హైదరాబాద్ సైక్లింగ్ రెవెల్యూషన్, హైదరాబాద్ రైడర్స్ క్రూ, హ్యాపీ హైదరాబాద్, సికింద్రాబాద్ సైక్లిస్ట్ గ్రూపులే కాకుండా నార్త్ స్పిన్నర్స్, సౌత్ స్పిన్నర్స్, ఈస్ట్ స్పిన్నర్స్, వెస్ట్ స్పిన్నర్స్ అపార్ట్​మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, వివిధ ఐటీ కంపెనీల ఉద్యోగులు పలు సైక్లింగ్ అసోసియేషన్లను ఏర్పాటుచేసుకుని రైడింగ్​లు చేస్తున్నారు. ఈ గ్రూపులతో సైక్లిస్ట్ల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతున్నాయని బైక్ హాలిక్స్ ప్రతినిధి రవి సాంబారి చెప్పారు.

నార్సింగి, అప్పాజంక్షన్, నానక్ రాంగూడ, కొల్లూరు, గచ్చిబౌలి, నెక్లెస్ రోడ్డు, నగర శివారు ప్రాంతాల్లో సైక్లిస్ట్​లతో పిక్నిక్ పాయింట్లుగా మారాయి. బర్త్ డేలు, మ్యారేజ్ డేలు, ఇతర ఫెస్టివల్స్​ను సైక్లిస్ట్​లు సోలార్ సైక్లింగ్ ట్రాక్ దగ్గరే జరుపుకుంటున్నారు. పాలపిట్ట సైకిల్ పార్క్, గచ్చిబౌలి బయోడైవర్సిటీ పార్క్​ల్లో హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ సైకిల్ రైడ్స్ నిర్వహిస్తోంది.

భవిష్యత్​లో నెహ్రూ జూపార్క్​లోనూ సైక్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు బైసైక్లింగ్ క్లబ్ నిర్వాహకులు చెప్పారు. మరికొన్ని ప్రధాన మార్గాల్లో సైకిల్ ట్రాక్​లను నిర్మాణానికి హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ ప్లాన్​ డిజైన్​ చేసిందని సైక్లింగ్ యాక్టివిస్ట్​లు రవి సాంబారి, ప్రియా లంగోటే చెప్పారు.

జిల్లాల్లో కూడా..
సైక్లింగ్ యాక్టివిటీస్​ వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, సిద్ధిపేట జిల్లాలకు విస్తరించాయి. హైదరాబాద్ సైక్లిస్ట్స్ గ్రూప్ సిటీలోని అతిపెద్ద స్వచ్ఛంద సైక్లింగ్ సంఘాల్లో ఒకటి. దీన్ని 2017లో రవీందర్ నందనూరి స్థాపించారు. 

లక్షమంది సైక్లిస్టులను తయారుచేయడం ద్వారా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సైక్లింగ్ రాజధానిగా మార్చడం లక్ష్యంగా హెచ్​సీజీ ప్రోగ్రామ్స్​ చేస్తోంది. ఈ గ్రూపు సైక్లిస్ట్​ల కోసం రోజువారీ, వారాంతపు, ఎండ్యూరెన్స్ రైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, శిక్షణా తరగతులు, సైక్లింగ్ చాలెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, సోషల్ రైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను నిర్వహిస్తున్నారు. ఈ గ్రూపు స్కూల్​ పిల్లల కోసం షూ డొనేషన్, రోడ్డు భద్రతపై అవేర్​నెస్​, ఎకోఫ్రెండ్లీ ట్రాన్స్​పోర్ట్​ను ప్రోత్సహించే ప్రోగ్రామ్​లు చేస్తోంది.

అంతేకాదు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 3,780 కిలో మీటర్ల దూరం కే2కే– 2017, కే2కే సెకండ్ ఎడిషన్ – 2021, కే2కే – 2023 హ్యాట్రిక్ ఎడిషన్​లను హైదరాబాద్ సైక్లిస్ట్స్ గ్రూప్ చేపట్టింది. ఈ గ్రూప్ 2020లో మనదేశంలో మొట్టమొదటి సైక్లింగ్ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్టార్ట్​ చేసింది. హాఫ్ ఎవరెస్టింగ్, యాన్యువల్​ ఎలివేషన్ చాలెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వంటి ఎండ్యూరెన్స్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను నిర్వహించింది. 

గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో పేద విద్యార్థులకు సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ ఫౌండర్ రవీందర్ నందనూరి చెప్పారు. పాఠశాల పేద విద్యార్థులకు వెయ్యి సైకిళ్లను అందించాలనే మిషన్ను తమ గ్రూప్ చేపట్టిందని ఆయన తెలిపారు. 

సైక్లింగ్ ద్వారా ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఈ2 ట్రైల్స్ కమ్యూనిటీ, ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్, సామాజిక అనుబంధాన్ని మేళవిస్తూ కొత్తగా సైక్లింగ్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది. కొత్తగా సైక్లింగ్ ప్రారంభించేవారికోసం గైడెడ్ సైక్లింగ్ రైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను నిర్వహిస్తోంది. హైదరాబాద్ సరస్సులు, వారసత్వ ప్రదేశాలు, పార్క్​లు, అంతగా తెలియని మార్గాలను అన్వేషిస్తున్నప్పుడు, అపరిచితులు తరచుగా స్నేహితులుగా మారిపోతారని ఈ 2 ట్రైల్స్ వ్యవస్థాపకులు సంకురాత్రి అశోక్ చెప్పారు. ప్రతి రైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుభవజ్ఞులైన రైడ్ లీడర్లు నాయకత్వం వహిస్తారు. ఈ 2 ట్రైల్స్ హోలీ, ఉమెన్స్ డే స్పెషల్, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, రమజాన్ రైడ్, శివరాత్రి సైకిల్ రైడ్స్ నిర్వహిస్తోంది.

పర్యావరణం పరిరక్షణ..
పర్యావరణం పరిరక్షణే పరమావధిగా తాము సైక్లింగ్ ఈవెంట్లు నిర్వహిస్తున్నామని హైదరాబాద్ సైక్లింగ్ రెవెల్యూషన్  కో ఫౌండర్, ఫిట్ ఇండియా తెలంగాణ బైసైకిల్ అంబాసిడర్ రవినేత చెప్పారు. తాను లండన్, దుబాయ్ దేశాల్లో సివిల్ ఇంజినీర్​గా పనిచేస్తున్నపుడు ప్రారంభించిన సైక్లింగ్ హైదరాబాద్ వచ్చాక కొనసాగిస్తున్నానని తెలిపారు. జాతీయ పతాకాలు సైకిల్​పై పెట్టుకుని చాలా సైకిల్ రైడ్స్ నిర్వహించారు. 

వీకెండ్స్ లో సైక్లింగ్ స్పెషల్ రైడ్స్
సైక్లింగ్ క్లబ్​లు 20 నుంచి100 కిలోమీటర్ల వరకు రైడ్​లు నిర్వహిస్తున్నాయి. మహిళల కోసం ప్రత్యేక రైడ్స్, కుటుంబాలతో కలిసి నిర్వహించే ఈవెంట్లు కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. సోషల్ మీడియాలో సైక్లింగ్ గ్రూపుల ప్రచారం కొత్తవారిని ఆకర్షిస్తోంది. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, సీనియర్ సిటిజన్లు ఇలా ఒకరేమిటి పెద్ద సంఖ్యలో సైక్లింగ్ కమ్యూనిటీల్లో చేరి ప్రతివారం సందడి చేస్తున్నారు.

గోల్కొండ, శంకరపల్లి, కొల్లూరు, నల్లగండ్ల, చార్మినార్, కేబీఆర్ పార్కు, లోటస్ పాండ్, ముచ్చింతల్ స్టాట్యూ, శివంపేట, దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జి ప్రాంతాలకు వీకెండ్స్ సైకిల్ రైడ్స్ చేస్తున్నారని బైక్ హాలిక్స్ ప్రతినిధి మనోజ్ కుమార్ చెప్పారు. సైక్లింగ్​ క్లబ్​లు కేవలం వ్యాయామానికి మాత్రమే కాకుండా కొత్త స్నేహాలు, నెట్‌‌‌‌‌‌‌‌వర్కింగ్‌‌‌‌‌‌‌‌కు కూడా వేదికగా మారాయి. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా సిటీలో జరిగిన అవగాహన కార్యక్రమాల తర్వాత యూత్​లో సైక్లింగ్‌‌‌‌‌‌‌‌పై ఆసక్తి మరింత పెరిగిందని క్లబ్ నిర్వాహకులు చెప్తున్నారు.