చియా సీడ్స్.. తినడం మంచిదే కానీ.. ఈ మందులు వాడేవారు జాగ్రత్త !

చియా సీడ్స్.. తినడం మంచిదే కానీ.. ఈ మందులు వాడేవారు జాగ్రత్త !

‘ఉదయం ఒక గ్లాస్ చియా వాటర్ తాగితే చాలు.. ఆరోగ్యం మీ సొంతం’ అంటూ సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు కనిపిస్తుంటాయి. నిజమే.. చియా సీడ్స్‌‌లో పీచు, ఒమెగా-– 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్​లు పుష్కలంగా ఉంటాయి.

కానీ వాటిని ఎలా తింటున్నామన్నదే అసలు విషయం. తప్పు పద్ధతిలో తీసుకుంటే జీర్ణ సమస్యల నుంచి అత్యవసర చికిత్స అవసరమయ్యే పరిస్థితి కూడా రావొచ్చని హార్వర్డ్, స్టాన్‌‌ఫోర్డ్‌‌లో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి హెచ్చరిస్తున్నారు.

చియా సీడ్స్‌‌ను నేరుగా నోట్లో వేసుకుని తినడం అస్సలు మంచిది కాదు అని డాక్టర్ సేథి చెప్తున్నారు. చియా సీడ్స్​ను నానబెట్టినప్పుడు అవి నీటిని బాగా పీల్చుకుని తమ పరిమాణం కంటే చాలారెట్లు ఉబ్బుతాయి. ఇలా గొంతులోనే ఉబ్బిపోతే ఆహారనాళంలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మింగడంలో ఇబ్బంది ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

ముందుగా నానబెట్టాలి
చియా సీడ్స్‌‌ను కనీసం 20 నిమిషాలు నీటిలో నానబెట్టి తీసుకోవడం మంచిది. ఇలా చేస్తే అవి జెల్‌‌లా మారి సులభంగా జీర్ణమవుతాయి. పెరుగు, పాలు, స్మూతీలు లేదా ఓట్స్‌‌లో కలిపి కూడా తీసుకోవచ్చు. 

నీళ్లు తప్పనిసరిగా తాగాలి
చియా సీడ్స్‌‌లో పీచు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటితోపాటు ఒక గ్లాస్ నీరు తాగడం అవసరం. తగినంత నీళ్లు తాగకపోతే మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

చివరగా..
చియా సీడ్స్ నిజంగా పోషకాలతో నిండిన ఆహారమే. అయితే వాటిని సరైన పద్ధతిలో తీసుకుంటేనే పూర్తి ప్రయోజనం లభిస్తుంది. నానబెట్టి, తగినంత నీటితో, పరిమిత మోతాదులో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని ఎక్స్​పర్ట్స్ సూచిస్తున్నారు.

మొదట తక్కువ మోతాదుతో..
మొదటి నుంచే ఎక్కువ మోతాదులో తినకండి. రోజుకు ఒక టీస్పూన్​తో ప్రారంభించి, శరీరం అలవాటు పడిన తర్వాత ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు పెంచుకోవచ్చు. ఒక్కసారిగా ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలు రావచ్చు.

ఈ మందులు వాడేవారు జాగ్రత్త
చియా సీడ్స్‌‌లో ఉండే ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు స్వల్పంగా రక్తాన్ని పలుచబరిచే ప్రభావం చూపొచ్చు. అందుకే వార్ఫరిన్ వంటి రక్తాన్ని పలుచబరిచే మందులు వాడుతున్నవారు ప్రతిరోజూ ఎక్కువ మోతాదులో చియా సీడ్స్ తీసుకోవాలంటే ముందు వైద్యుడి సలహా తీసుకోవాలి.