కాకి కనబడుట లేదు..! హైదరాబాద్ లో కాకులను వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందా...?

కాకి కనబడుట లేదు..! హైదరాబాద్ లో కాకులను వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందా...?

ఒకప్పుడు పొద్దున్నే కాకుల కూతలతో మేల్కొనే హైదరాబాద్.. ఇప్పుడు ఇదే నగరంలో కాకులను వెతకాల్సిన పరిస్థితి వచ్చిందా? ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు హైదరాబాద్ బర్డ్ అట్లాస్ శాస్త్రీయ సర్వే స్టార్ట్ చేసింది. ఈ నెల 4న మొదలైన సర్వే 26వతేదీ వరకు కొనసాగనుంది. డబ్ల్యుడబ్ల్యుఎఫ్ -ఇండియా, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ , దక్కన్ బర్డర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఈ ఏడాది జీహెచ్‌ఎంసి, తెలంగాణ అటవీ శాఖ కూడా మద్దతు ఇస్తున్నాయి.

హైదరాబాద్​తోపాటు దీని పరిసర ప్రాంతాల్లో ఉన్న పక్షి జాతులను క్రమపద్ధతిలో నమోదు చేసే లక్ష్యంతో హైదరాబాద్ బర్డ్ అట్లాస్ ఏర్పాటైంది. పక్షుల పరిశీలకులు, ప్రకృతి పరిరక్షకులు, వాలంటీర్లు, ఫొటోగ్రాఫర్లు అంకితభావం, ఉత్సాహంతో180 సబ్-సెల్స్‌‌లో సర్వే చేపట్టారు. ఇప్పటికే మూడు సీజన్ల సర్వే పూర్తి కాగా ప్రస్తుతం 4వ సీజన్ కొనసాగుతోందని హైదరాబాద్ బర్డింగ్ పాల్ ప్రధానకార్యదర్శి రాజీవ్ ఖండేల్ వాల్ చెప్పారు. 

సిటీలోని బర్డ్స్ హాట్​స్పాట్లలో వివిధ జాతుల పక్షుల పరిరక్షణ ప్రయత్నాల కోసం శాస్త్రవేత్తలు, పక్షుల పరిరక్షకులు, ఫొటోగ్రాఫర్లు విధాన రూపకర్తలకు ఉపయోగపడేలా విలువైన సమాచారాన్ని ఈ పక్షుల సర్వేలో సేకరిస్తున్నారు. అడవులు, గడ్డి మైదానాలు, చిత్తడి నేలలు, పార్కులు, విభిన్న ఆవాసాల్లో ఈ పక్షుల సర్వే సాగుతుంది. 45 గ్రిడ్​లుగా విభజించి సర్వే చేపట్టారు.

అంతరిస్తున్న కాకులపై అధ్యయనం...

సాధారణంగా ఎక్కడ చూసినా కనిపించే పక్షిగా భావించి కాకులను పెద్దగా నమోదు చేయరు. అయితే ఇటీవల నగరంలో వాటి సంఖ్య తగ్గుతోందన్న అభిప్రాయాలు బలపడటంతో ప్రత్యేక అధ్యయనం ప్రారంభించామని రాజీవ్ చెప్పారు. పక్షి కనపడకపోతే అది కేవలం ఒక జాతి సమస్య కాదు, నగర పర్యావరణ సమతుల్యతకు హెచ్చరికగా పరిగణించాలని పక్షి పరిశీలకులు చెప్తున్నారు. కాకులు నిజంగానే కనుమరుగవుతున్నాయా లేదా కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయా అనేది తెలుసుకోవడానికి పక్షుల ప్రేమికులు ప్రయత్నిస్తున్నారు.  

ఎన్ని జాతుల పక్షులున్నాయంటే...

హైదరాబాద్ బర్డ్ అట్లాస్ ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు మూడు సీజన్లలో పక్షుల సర్వే చేశారు. గతేడాది ఫిబ్రవరి నెల సర్వేలో 67 వేల పక్షులను డాక్యుమెంట్ చేశారు. వ్యక్తిగత పక్షుల గణనలో పావురాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. నగరంలోని పక్షుల హాట్ స్పాట్లలో195 రకాల పక్షులు నగరంలో ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. జులై నెల సర్వేలో166 రకాల పక్షులను గుర్తించారు. స్థానిక జాతులు, సంతానోత్పత్తి పక్షులపై దృష్టి సారించి వీటిని రికార్డు చేశారు. 

►ALSO READ | అల్యూమినియం Vs స్టెయిన్‌లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్: మన వంటగదికి ఏది బెస్ట్ అంటే ?

రుతుపవనాల సమయం పక్షులకు బ్రీడింగ్ సీజన్​గా గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిపిన సర్వేలో నగరంలో 214 పక్షిజాతులను రికార్డు చేశారు. ఈ సర్వేలో పెద్ద కాళ్లతో కూడిన అరుదైన పక్షులను కనుగొన్నారు. సిటీలో కాకుల జాడ కోసం శాస్త్రీయ సర్వేలు నిర్వహించాల్సిన పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఈ సర్వే కాకుల సంఖ్యపై స్పష్టత ఇవ్వడమే కాకుండా, నగర జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలకు మార్గదర్శకంగా నిలవనుంది.

సలీం అలీ స్ఫూర్తితో..

ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ నిజాం ప్రభుత్వ ఆహ్వానంతో హైదరాబాద్ రాష్ట్రంలోని అడవులు, జలాశయాలు, వివిధ ప్రాంతాలను సందర్శించి పక్షి జాతులను నమోదు చేశారు. ఆ పరిశోధనల్లో 1930 సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్ర పక్షిజాలంపై శాస్త్రీయ సమాచారం వెలుగులోకి వచ్చింది. 90 ఏళ్ల తర్వాత హైదరాబాద్ బర్డ్ అట్లాస్ నగర పక్షులపై మరో సమగ్ర సర్వే చేపట్టింది. 1931 ప్రాంతంలో సలీం అలీ హైదరాబాద్​లో చేపట్టిన బర్డ్​ రీసెర్చ్​ తర్వాత, నగర స్థాయిలో ఇంత విస్తృతంగా జరుగుతున్న బర్డ్​ సర్వే ఇదే తొలిసారి అని పక్షి పరిశీలకులు చెప్పారు. గత సర్వేల్లో నగరంలో 214 పక్షి జాతులు నమోదు కావడం హైదరాబాద్ జీవవైవిధ్యానికి నిదర్శనం. 

బెస్ట్​ బర్డ్​  హాట్​స్పాట్​ 

హిమయత్‌సాగర్ దగ్గరలో ఉన్న కొత్వాల్‌గూడ ఎకో పార్క్ ఆసియాలోనే అతిపెద్ద పక్షుల కేంద్రాల్లో ఒకటి. ఇక్కడ అమెజాన్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా వంటి ప్రాంతాల నుంచి వలస వచ్చిన అరుదైన పక్షులు కనిపిస్తుంటాయి. మియాపూర్ దగ్గర్లోని అమీన్‌పూర్ చెరువు బర్డ్ వాచర్‌లకు ఇష్టమైన ప్రదేశం. ఇక్కడకు ప్రతి ఏటా విదేశీ వలస పక్షులు, కొంగలు, బాతులు భారీగా వస్తుంటాయి. 

కృష్ణకాంత్ పార్క్, నెహ్రూ జూలాజికల్ పార్క్, లోటస్ పాండ్​లో పక్షుల కిలకిలరావాలు వినిపిస్తుంటాయి. అన్నారం నేచర్ అవేర్‌నెస్.. సెంటర్ పక్షులు, సీతాకోకచిలుకలకు నిలయం. మంజీరా వన్యప్రాణుల అభయారణ్యం విదేశీ వలస పక్షులు, కొంగలు, నీటి పక్షులకు ఫేమస్​. కేబీఆర్ పార్క్​, ఇందిరా, సంజీవయ్య పార్క్​లు, సిటీ శివార్లలోని జాతీయ పార్క్​లు పక్షులకు నిలయాలుగా మారాయి.