భారతీయ వంటగదిలో ప్రెషర్ కుక్కర్ లేని ఇల్లు ఉండదు. పొద్దున్నే ఆఫీసుకి వెళ్లే హడావిడిలో పప్పు వండాలన్నా, రాత్రికి అన్నం పెట్టాలన్నా.. అందరికీ గుర్తొచ్చే మొదటి వస్తువు కుక్కరే. అయితే, పాత కుక్కర్ పాడైపోయి కొత్తది కొనాలనుకున్నప్పుడు.. అల్యూమినియం కుక్కర్ కొనాలా ? లేక స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్ కొనాలా ? అనే డౌట్ చాలా మందికి వస్తుంది.
పైకి చూడ్డానికి రెండు ఒకేలా అనిపించినా, వాడుకలో మాత్రం చాలా తేడాలు ఉన్నాయి. వీటిలో ఏది సురక్షితం, ఏది ఎక్కువ కాలం నిలిస్తుందో సింపుల్‌గా తెలుసుకుందాం...
ఏ కుక్కర్ ఎలా పనిచేస్తుందంటే ?
అల్యూమినియం కుక్కర్: ఇది లోపల ఆవిరిని గట్టిగా పట్టి ఉంచడం ద్వారా ఆహారాన్ని ఉడికిస్తుంది. అల్యూమినియం చాలా వేగంగా వేడెక్కుతుంది, బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది.
స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్: ఇది కూడా అదే పద్ధతిలో పనిచేస్తుంది. కానీ, ఇది మరింత బలంగా, తుప్పు పట్టని మెటీరియల్‌తో తయారవుతుంది. ఇప్పుడు వస్తున్న కొత్త స్టీల్ కుక్కర్ల అడుగుభాగంలో వేడి సమానంగా అందడానికి అల్యూమినియం లేదా ఇండక్షన్ ప్లేట్‌ను వాడుతున్నారు.
ఆరోగ్యం, సేఫ్టీ విషయంలో ఏది సేఫ్?
కుక్కర్ కొనేటప్పుడు అందరికీ వచ్చే మొదటి భయం ఇదే. పేరున్న బ్రాండ్ల నుంచి మనం కొనేఅల్యూమినియం, స్టీల్ కుక్కర్లు రెండూ వాడకానికి సురక్షితమే. కానీ, ఎక్కువ కాలంలో చూస్తే స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కరే ఎక్కువ సురక్షితం. దీనికి గీతలు పడటం, అరిగిపోవడం, తుప్పు పట్టడం వంటి సమస్యలు ఉండవు. అల్యూమినియం కుక్కర్‌లో కొన్ని రకాల పులుపు వస్తువులు వండినప్పుడు అది ఆహారంతో కొద్దిగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ స్టీల్‌తో ఆ భయం అస్సలు ఉండదు.
దేంట్లో వంట త్వరగా అవుతుందంటే?
మీకు టైమ్ కలిసిరావడమే ముఖ్యమైతే అల్యూమినియం కుక్కర్ ఫస్ట్ ఛాయిస్. అల్యూమినియం త్వరగా వేడెక్కడం వల్ల కుక్కర్‌లో ప్రెషర్ (విజిల్) వేగంగా వస్తుంది. పొద్దున్నే హడావిడిగా వంట చేసుకోవాలి ఆనుకునే వారికి ఇది బాగా హెల్ప్ అవుతుంది.
►ALSO READ | Women Special: మహిళల్లారా ఈ టిప్స్ పాటించండి.. కూరలు క్షణాల్లో తయారవుతాయి..!
స్టీల్ కుక్కర్ వేడెక్కడానికి కొంచెం టైమ్ పడుతుంది. అయితే, అడుగు భాగం మందంగా ఉండే స్టీల్ కుక్కర్లు ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి ఈ తేడా చాలా వరకు తగ్గిపోయింది.
దేన్ని క్లీన్ చేయడం, మెయింటైన్ చేయడం ఈజీ అంటే ?
ఈ విషయంలో స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్ చాలా బెస్ట్. స్టీల్ కుక్కర్లకు అంత సులభంగా మరకలు పడవు, గీతలు పడినా తట్టుకుంటాయి. ఎన్ని సంవత్సరాలైనా వీటి మెరుపు తగ్గకుండా కొత్తవాటిలా మెరుస్తూ ఉంటాయి. అల్యూమినియం కుక్కర్లు కొన్ని ఏళ్లు బాగానే పనిచేసినా.. రోజులు గడిచేకొద్దీ నల్లగా మారడం, ఎంత కడిగిన మెరవకపోవడం, మరకలు పడి పాతవాటిలా కనిపిస్తుంటుంది.
మన ఇళ్లకు ఏది ఎక్కువ ఉపయోగపడుతుందంటే?
చిన్న ఫ్యామిలీస్ / అప్పుడప్పుడు వండేవారు.. ఎక్కువ ఖర్చు పెట్టడం ఇష్టం లేకపోతే అల్యూమినియం కుక్కర్ మంచి ఆప్షన్. తక్కువ ధరలో ఇది చక్కగా పని పూర్తి చేస్తుంది.
ప్రతిరోజు వంట చేసే పెద్ద కుటుంబాలు.. రోజుకు రెండు మూడు సార్లు కుక్కర్ వాడే ఇళ్లకు స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్ ఒక సూపర్ ఇన్వెస్ట్‌మెంట్. దీని ధర కొంచెం ఎక్కువైనా, ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా ఏళ్ల పాటు వాడుకోవచ్చు.
చివరికి.. మీ బడ్జెట్ తక్కువగా ఉండి, తేలికగా ఉండేది కావాలంటే అల్యూమినియం తీసుకోండి. కానీ, ఒక్కసారి కొంటే పదేళ్లయినా పాడవకుండా, ఆరోగ్యానికి సురక్షితంగా, మెరుస్తూ ఉండాలి అనుకుంటే మాత్రం స్టెయిన్‌లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ కొనడమే అన్ని విధాలా తెలివైన నిర్ణయం.
