పాలేరు నుంచి పటేల్ వరకు... తొలి తరం గల్ఫ్ కార్మికుడి అపూర్వ గాథ..

పాలేరు నుంచి పటేల్ వరకు... తొలి తరం గల్ఫ్ కార్మికుడి అపూర్వ గాథ..

అది 1970. తెలంగాణలోని పలు జిల్లాల్లో కరవు, పేదరికం, ఉపాధి లేమి ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. రోజువారీ కూలి పనులతో కుటుంబాన్ని పోషించడం కూడా కష్టంగా మారింది. దాంతో చాలామంది గల్ఫ్ దేశాల వైపు అడుగులు వేశారు. ఎడారిలో చెమటోడ్చి సంపాదించిన ప్రతి రూపాయి.. కుటుంబాల అభ్యున్నతికి పునాది అయింది. ఆరు దశాబ్దాల తర్వాత ఆ తొలి తరం గల్ఫ్ కార్మికుల జీవితాలను తిరిగి పరిశీలిస్తే.. అది కష్టాలు, కన్నీళ్లు, త్యాగాలు, విజయాలతో నిండిన ఓ అపూర్వ గాథ.

గల్ఫ్ దేశాల్లో వలసకార్మికులు పంపిన డబ్బుతో గ్రామాల్లో అప్పులు తీరాయి. గుడిసెల స్థానంలో పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. పాలేరుగా పనిచేసిన వారు.. భూస్వాములయ్యారు. అంతకంటే గొప్ప మార్పు.. తదుపరి తరంలో కనిపించింది. ఈ విజయాల వెనుక మాత్రం కనిపించని ఎన్నో త్యాగాలు ఉన్నాయి. సంవత్సరాల తరబడి కుటుంబాలకు దూరంగా జీవించడం.. పండుగలు, పిల్లల పెరుగుదల, కుటుంబ వేడుకలు అన్నింటినీ కోల్పోవడం.. ప్రమాదాలు, అనారోగ్యం, ఒంటరితనం.. ఇవన్నీ ఆ తరం గల్ఫ్ కార్మికుల జీవితంలో విడదీయరాని భాగమయ్యాయి. 

అయితే వారు మాత్రం.. ‘‘మా కష్టం వృథా కాలేదు. మా పిల్లలు మాలాంటి జీవితం గడపకూడదనేదే మా లక్ష్యం” అంటున్నారు. తెలంగాణలో గల్ఫ్ వలసల చరిత్ర.. కేవలం విదేశాలకు వెళ్లిన కార్మికుల కథ కాదు. అది ఆకలి నుంచి ఆత్మగౌరవానికి సాగిన ప్రయాణం. 

సముద్రాన్ని దాటి ఎడారి దేశానికి చేరి 49 ఏళ్లు..

మనరాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు కార్మికుల వలస1970వ సంవత్సరం నుంచి ఆరంభం అయింది. అప్పట్లో కార్మికులు సముద్రం మీదుగా షిప్​లలో ప్రయాణాలు చేసి గల్ఫ్ దేశాలకు వెళ్లారు. అలా వెళ్లిన వాళ్లలో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన మిట్టపెల్లి గంగారాం ఒకరు. ఆయన గల్ఫ్ దేశానికి పడవ ప్రయాణం చేసి 49 ఏళ్లు అయింది. నాటి పరిస్థితులు తన జీవితాన్ని ఎలా మార్చాయో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

‘‘అది1963వ సంవత్సరం. నేను మా గ్రామంలోని పటేల్ నారాయణ దొర దగ్గర పాలేరుగా పశువులు కాసేవాడిని. ఎంత పనిచేసినా పైసలు చాలక ఇల్లు గడిచేది కాదు. దీంతో నా భార్య బుచ్చమ్మ కూడా పొలం పనులకు వెళ్లాల్సి వచ్చింది. ఇక లాభంలేదనుకుని ఆ తర్వాత నేను పాలేరు పని వదిలి పొట్ట పోసుకునేందుకు బొంబాయిబాట పట్టాను.

బొంబాయి టూ గల్ఫ్ 

బొంబాయి వెళ్లి బట్టల మిల్లులో పవర్ లూమ్ కార్మికుడిగా చేరాను. ఉన్నట్టుండి ఒకరోజు బట్టల మిల్లుకు తాళం వేసి బంద్ పెట్టారు. దీంతో నా ఉద్యోగం పోయింది. బొంబాయిలో పని దొరక్కపోవడంతో1977లో ఏజెంట్​ను బతిమాలితే పాస్ పోర్టు, వీసా ఇప్పించాడు. దాంతో రూ.1,100లు పెట్టి ఓడలో బొంబాయి నుంచి 9 రోజులు ప్రయాణించి టార్గెట్ ఇంజనీర్ కంపెనీ తరపున సొబతు వాళ్లతో కలిసి దుబాయ్​కి వెళ్లా. అయితే నాకు చదువులేదు. ఆ దేశంలోని భాష తెలియదు. 

►ALSO READ | నీతికథ : మొసలి కన్నీరు .. కపట బుద్ది..చెడు ఆలోచనలు.. పైకి ఏడుపు.. ఇలాంటి వారిని అస్సలు నమ్మొద్దు..!

మండే ఎండలు.. మరో వైపు కఠినమైన శ్రమ.. అయినా నా కుటుంబం కోసం అన్నింటినీ భరించా. నాకు వచ్చిన కొద్దిపాటి ఎలక్ట్రీషియన్ పనిచేస్తూనే మరోవైపు లేబరు పనులు చేశా. బువ్వలేక నీళ్లు తాగి ఆకలికి ఓర్చుకున్న రోజులూ ఉన్నాయి. ఉండటానికి ఠికానా కూడా సరిగా ఉండేది కాదు.

సఫాయి పని వచ్చింది

దుబాయ్​లో18 నెలలు పనిచేశాక నాకు అబుదాబి సిటీ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా కాంట్రాక్టు ఉద్యోగం వచ్చింది.  రోజూ సముద్రం పక్కన ఉన్న హిల్టన్ హోటల్ ముందున్న కార్మేకు రోడ్డును ఊడ్చే డ్యూటీ. పొద్దుగాలంతా రోడ్లు ఊడ్చేవాడిని. రాత్రి కాగానే మార్కెట్​కు వెళ్లి హమాలీగా మూటలు మోసేవాడిని. హమాలీగా పనిచేసినందుకు 6 నుంచి12 దిర్హామ్ లు వచ్చేవి.

దీంతోపాటు పారిశుద్ధ్య కార్మికుడిగా శుక్రవారాలు సెలవైనా నేను నెలకు నాలుగు శుక్రవారాలు కూడా ఓవర్ టైం పనిచేశా. అప్పట్లో ఒక దిర్హామ్ అంటే మన కాడ రెండు రూపాయలు వచ్చేది. అలా మూడేళ్లపాటు ఇంటికి రాకుండా పనిచేశా. రెండేళ్లకొకసారి ఇంటికి వచ్చి భార్య పిల్లలను చూసుకుని వెళ్లేవాడిని. 

పటేల్ దగ్గర పొలం కొన్నా..

ఆ దేశంలో దిర్హామ్ దిర్హామ్ కూడబెట్టిన డబ్బును నా భార్యకు పంపించేవాడిని. మేం పడిన కట్టం మా పిల్లలు పడకూడదని మేమిద్దరం అనుకున్నాం. అలా కూడబెట్టిన డబ్బు రూ. 24 వేలతో నేను పనిచేసిన పటేల్ అయిన నారాయణ దొర దగ్గర ఎకరం 6వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాలు కొన్నా. ఆ భూమిలో మామిడితోట వేశా. అలా 18 ఏళ్లపాటు గల్ఫ్ దేశంలో పనిచేస్తూనే డబ్బు జమ చేసి మొత్తం15 ఎకరాల భూమి కొన్నా. ఇప్పుడు ఆ భూమి ఎకరం ధర రూ.60 లక్షలయ్యింది. సాగుభూమితోపాటు ఆరు గుంటల ఇంటి జాగా కూడా కొన్నా. ఆ స్థలంలో పెంకులతో ఇల్లు, రేకులతో పశువుల కొట్టం కట్టిన. 

అప్పట్లో పైసలు లేక నా పిల్లల్ని చదివించలేక పోయా. దీంతో వాళ్లు పొలం పనుల్లోకి దిగారు. నాకు పెద్ద కొడుకు రాజారాం, చిన్న కొడుకు ప్రభాకర్. ఇద్దరూ పొలాన్ని దున్నుకుంటూ జిందగీ నడుపుతున్నారు. నా కూతురు మణెవ్వకు పెళ్లి చేశా. నానా కట్టాలు పడి భూములు కొనడం వల్ల నా పిల్లల బతుకు బాగు అయింది. 1996లో గల్ఫ్ నుంచి 2 లక్షలు తీసుకొచ్చా. దాంతో పొలాలు, ఇంటి జాగాలు కొన్నా. ఎన్నో కట్టాలు పడి పిల్లల్ని చూసుకున్న నా భార్య బుచ్చవ్వ పాణం బాలేక కాలం చేసింది. 

నా వయసు 70 ఏళ్లు దాటినా ఇంటి దగ్గరే గేదెలు, ఆవులు చూసుకుంటున్నా. నా మనవళ్లు ఇద్దరూ హోటల్ మేనేజ్​మెంట్ కోర్సు చదివి విదేశాలకు వెళ్లారు. నాకు భగవంతుడు కల్పించిన అవకాశం నాకు జీవితంలో కష్టపడినా సంతృప్తిగా ఉంది అంటున్నాడు గంగారం.

తొలితరం కార్మికులను గౌరవించాలి 

1970 దశకంలో ధైర్యసాహసాలతో స్వదేశాన్ని విడిచి గల్ఫ్ దేశాలకు వెళ్లిన తొలి తరం గల్ఫ్ కార్మికులు భారతదేశ ఆర్థికాభివృద్ధికి విశేషంగా దోహదపడ్డారు. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ కుటుంబాలను ఆదుకున్న వారి జీవిత అనుభవాలు, పోరాట గాథలను ప్రభుత్వం నమోదు చేసి భావితరాలకు చరిత్రగా అందించాలి. 
 - మంద భీంరెడ్డి, వైస్ చైర్మన్, తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ