ముంబై: విదేశీ కంపెనీలు కూడా ఐపీఓల కోసం దేశీయ స్టాక్ మార్కెట్ల తలుపులు తడుతున్నాయి. పలు యూరప్ కంపెనీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టింగ్ కావడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. అర డజనుకు పైగా కంపెనీలు ఇప్పటికే సెబీకి పేపర్లు అందజేశాయి. మరికొన్ని దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇటలీకి చెందిన బాన్ఫిగ్లియోలి గ్రూప్ భారతీయ విభాగం బాన్ఫిగ్లియోలి ట్రాన్స్‌మిషన్స్ రూ.2 వేల కోట్ల ఐపీఓ కోసం గత నెల అనుమతి పొందింది. ఇది 4.7 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో ఉండనుంది.
స్వీడన్‌కు చెందిన ప్లేసింపుల్ కూడా రూ.3,150 కోట్ల ఐపీఓ కోసం దరఖాస్తు చేసుకుంది. స్విట్జర్లాండ్ కంపెనీ ఇన్నోటెర్రా గత నెల డ్రాఫ్ట్ పేపర్లను సమర్పించింది. ఇందులో రూ.105 కోట్ల వరకు తాజా ఇష్యూ, 70.55 లక్షల షేర్ల ఓఎఫ్ఎస్ ఉన్నాయి. స్వీడిష్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఈక్యూటీ పార్ట్నర్స్ తన ఔట్‌సోర్సింగ్ ప్లాట్‌ఫారమ్ స్ట్రైవ్ కోసం రూ.3,800 కోట్ల ఐపీఓను ప్లాన్ చేస్తోంది. దీని మద్దతు ఉన్న మరో సంస్థ వర్చుసా కూడా ఐపీఓ గురించి ఆలోచిస్తోంది. జర్మన్ ఆటో స్పేర్స్ వెబాస్టో వచ్చే ఏడాది ప్రారంభంలో ఐపీఓ కి రావాలని యోచిస్తోంది. ఈవారం వస్తున్న ఎస్ఐబీ ఫండ్స్ రూ.11,700 కోట్ల ఐపీఓలో ఫ్రాన్స్‌కు చెందిన అముండి కూడా భాగస్వామి.
ఎస్‌బీఐ ఫండ్స్‌లో 1.42 శాతం వాటా అమ్మకం
ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎస్‌బీఐఎఫ్‌ఎం) లో 1.42శాతం వాటాను ప్రిఐపీఓలో 30 మంది ఇన్వెస్టర్లకు రూ.1,655 కోట్లకు విక్రయించింది. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ గరిష్ట ధర అయిన రూ. 574 వద్ద మొత్తం 2,88,32,748 ఈక్విటీ షేర్లను అమ్మామని తెలిపింది. ఎస్‌బీఐఎఫ్‌ఎం ఐపీఓ ఈ నెల 14–16 తేదీల్లో ఉంటుంది. తాజాగా వాటాను కొనుగోలు చేసిన వారిలో టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్, బెన్నెట్ అండ్ కోల్‌మన్, ఆనంద్ రాఠీ గ్లోబల్ ఫైనాన్స్, 360 వన్ ఫండ్స్ వంటి పెద్ద కంపెనీలు ఉన్నాయి.
