న్యూఢిల్లీ: జూలై14 న ప్రారంభం కానున్న ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓతో పాటు, జులై చివరి నాటికి మరో ఐదు కంపెనీలు మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇవి సుమారు రూ. 15 వేల కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ఐపీఓల జాబితాలో మణిపాల్ హెల్త్ ఎంటర్‌ప్రైజెస్, మిల్కీ మిస్ట్ డెయిరీ ఫుడ్స్, జునిపెర్ గ్రీన్ ఎనర్జీ, లోహియా కార్ప్, కాలిబర్ మైనింగ్ అండ్ లాజిస్టిక్స్ ఉన్నాయి. వీటిలో మణిపాల్ హాస్పిటల్స్ నిర్వహించే మణిపాల్ హెల్త్ ఎంటర్‌ప్రైజెస్ అత్యధికంగా రూ. 9,500 కోట్ల విలువైన ఐపీఓతో రానుంది.
తమిళనాడుకు చెందిన మిల్కీ మిస్ట్ డెయిరీ దాదాపు రూ. 2 వేల కోట్లు, జునిపెర్ గ్రీన్ ఎనర్జీ రూ. 1,800 కోట్లు సేకరించాలని భావిస్తున్నాయి. అలాగే కాలిబర్ మైనింగ్ రూ. 500–-600 కోట్లు, లోహియా కార్ప్ ఓఎఫ్ఎస్ ద్వారా రూ. 500 కోట్లు సేకరించనున్నాయి. వీటితో పాటు జులై చివరి వారం, ఆగస్టు మొదటి వారంలో టాన్బో ఇమేజింగ్, సింబియోటెక్ ఫార్మా ల్యాబ్, జెప్టో కంపెనీల ఐపీఓలు కూడా ప్రారంభంకానున్నాయి.
