కమ్మర్ పల్లి ఫారెస్ట్ లో పులి కళేబరం .. పోలీసుల అదుపులో నలుగురు

కమ్మర్ పల్లి ఫారెస్ట్ లో పులి కళేబరం .. పోలీసుల అదుపులో నలుగురు
  • చనిపోయింది చిరుతపులి అని అనుమానాలు

నిజామాబాద్/బాల్కొండ, వెలుగు : నిజామాబాద్ ​జిల్లాలోని భీంగల్ మండలం కారేపల్లి అటవీ ప్రాంతంలో పులి కళేబరాన్ని ఆఫీసర్లు గుర్తించారు. భీంగల్ మండలానికి చెందిన కొందరు వ్యక్తులు పులిని చంపినట్లు చర్చించుకుంటుండగా.. ఈ విషయం కమ్మర్ పల్లి పోలీసులకు తెలిసింది. దీంతో వారు ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. వారు విచారణ చేపట్టి గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో పులిని పాతిపెట్టినట్లు గుర్తించారు. 

ఆదివారం జేసీబీతో పులి కళేబరాన్ని బయటకు తీసి, హైదరాబాద్ నుంచి రప్పించిన వెటర్నరీ టీంతో పోస్ట్ మార్టం చేయించారు. అనంతరం డాగ్ స్క్వాడ్ సాయంతో తాళ్లపల్లి, దేవక్కపేట గ్రామాల్లో గాలింపు చేపట్టి నలుగురు అనుమానితులను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే చనిపోయింది చిరుతపులి అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చనిపోయింది ఏ పులి ? 

గతేడాది జులైలో జిల్లాలోకి వచ్చిన మగ పులి రామారెడ్డి, దోమకొండ, బీబీపేట, భిక్కనూర్​, సిరికొండ అడవిలో సంచరించి ఆవులపై దాడి చేసింది. ఆ పులికి ఫారెస్ట్ ఆఫీసర్లు ఎస్​12గా పేరు పెట్టారు. కొన్ని రోజుల తర్వాత పులి జాడ తెలియకపోవడంతో ట్రాక్ చేసేందుకు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఆ తర్వాత నవంబర్ లో మరో మగ పులి జిల్లాలో ప్రవేశించగా దానికి జే1గా పేరు పెట్టారు.

 మహారాష్ట్రలోని తాడోబా నుంచి వచ్చిన ఈ పులి ఏప్రిల్ 2026లో భీంగల్ మండలంలో ఆవుపై దాడి చేసిన తర్వాత కనిపించకుండా పోయింది. దానిని గుర్తించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు దొరికిన కళేబరం ఏ పులికి చెందినదోనని ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నారు. 

విష ప్రయోగంతో పులిని చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆవులను చంపుతుందని రైతులే విషం పెట్టారా ? లేక స్మగ్లర్ల ప్రమేయం ఉందా ? అసలు చనిపోయింది పులేనా ? లేక చిరుతపులా ? అనే కోణంలో ఆఫీసర్లు విచారిస్తున్నారు.