లైసెన్స్ లేని ఎలక్ట్రీషియన్లతో విద్యుత్ ప్రమాదాలు..ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్

లైసెన్స్ లేని ఎలక్ట్రీషియన్లతో విద్యుత్ ప్రమాదాలు..ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్

హైదరాబాద్, వెలుగు: విద్యుత్ శాఖ అధికారిక గుర్తింపు లేని ఎలక్ట్రీషియన్ల వల్లే విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క యాదగిరి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌‌లో తెలంగాణ ఎలక్ట్రికల్ జేఏసీ ఆధ్వర్యంలో సైంటిస్ట్ నికోలా టెస్లా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యాదగిరి హాజరై మాట్లాడారు.

రాష్ట్రంలోని ప్రతి ఎలక్ట్రీషియన్​ ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు ద్వారా వైర్‌‌మన్ పర్మిట్‌‌తో పాటు సూపర్‌‌వైజర్ పర్మిట్ కూడా పొందాలని సూచించారు. ప్రస్తుతం కొన్ని జిల్లాలకే పరిమితమైన డబ్ల్యూఆర్–1, డబ్ల్యూఆర్–2 విధానాలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని, తద్వారా విద్యుత్ ప్రమాదాలను గణనీయంగా నివారించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సభ నిర్వాహకుడు కొండ బాల్‌‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ఎలక్ట్రీషియన్ల సంఘాలు జేఏసీ వేదికగా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

ఎలక్ట్రీషియన్లు ఎదుర్కొంటున్న సమస్యలు, పని రేట్లకు సంబంధించిన అంశాలను జేఏసీ దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు సభ్యుడు నేమాల బెనర్జీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై. వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.