భూదాన్ భూములకు ప్రత్యేక సర్వే చేపట్టాలి : ఆర్.శంకర్

భూదాన్ భూములకు ప్రత్యేక సర్వే చేపట్టాలి : ఆర్.శంకర్

బషీర్‌‌‌‌బాగ్, వెలుగు: రాష్ట్రంలోని భూదాన్ భూముల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి, వాటి వివరాలను డిజిటలైజ్ చేసి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అందుబాటులో ఉంచాలని తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ భూ రికార్డుల్లో ప్రత్యేక 'భూదాన్' విభాగంగా చేర్చాలని సూచించారు. దీంతో అక్రమ రిజిస్ట్రేషన్లు, ఆక్రమణలను అడ్డుకోవచ్చన్నారు. హైదరాబాద్‌‌‌‌లోని బషీర్‌‌‌‌బాగ్ ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 

ప్రస్తుతం అనేక భూదాన్ భూములు ఆక్రమణలు, సరిహద్దు వివాదాలు, అక్రమ లావాదేవీలు, అసంపూర్ణ రెవెన్యూ రికార్డుల సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర సర్వే చేపట్టాలని కోరారు. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్​ చేశారు.