- శనివారం ఉదయం తిమ్మాపూర్ రైల్వేస్టేషన్‌లో రాజ్‌కుమార్
- కారులో పెట్రోల్ ఖతం, రైలు పట్టాలపై కొద్దిసేపు నిలబడ్డ నిందితుడు
- చచ్చేందుకు ధైర్యం చాలక ఆత్మహత్యకు వెనకడుగు
- రోడ్డు మార్గంలో బెంగళూర్ లేదా శ్రీశైలం వెళ్లినట్లు అనుమానాలు
- శ్రీశైలం, బెంగళూర్ హైవేలోని లాడ్జీలు, హోటల్స్, దాబాలను జల్లెడ పడుతున్న స్పెషల్ టీమ్స్
- బెట్టింగ్‌ల కోసం 4 ఫోన్లు, 16 సిమ్ కార్డులు వాడినట్లు గుర్తింపు
- హత్యలకు రెండు రోజులు రెక్కీ నిర్వహించినట్టు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన షాబాద్ ఆరు హత్యల కేసులో నిందితుడు పార్వతి రాజ్‌కుమార్(29) కోసం పోలీసులు వేట ముమ్మరం చేశారు. శ్రీశైలం, బెంగళూర్ సహా చెన్నైలో 15 స్పెషల్ టీమ్స్‌తో గాలిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా రాజ్‌కుమార్ వాడిన ఫోన్ నంబర్, సిమ్‌కార్డులు, సెల్‌ఫోన్ లాస్ట్ లొకేషన్ ఆధారంగా పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి హత్యలు చేసిన అనంతరం రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలో చివరి సారి నిందితుడి కదలికల్ని గుర్తించారు. సీడీఆర్, ఇతర సాంకేతికత ఆధారంగా రాజ్‌కుమార్ మొత్తం నాలుగు సెల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులు వాడినట్లు గుర్తించారు. వీటిని గేమింగ్, బెట్టింగ్ యాప్స్ కోసం వినియోగించినట్లు ఆధారాలు సేకరించారు. శుక్రవారం రాత్రి వరుస హత్యల అనంతరం11.50 గంటలకు నిందితుడు ఫోన్ స్విచాఫ్ చేశాడు. ప్రస్తుతం ఫోన్లు, 16 సిమ్ కార్డుల్లో ఒక్కటి కూడా వాడటంలేదని గుర్తించారు.
రాజ్‌కుమార్ ఆదివారం ఉదయం పోలీసులకు చిక్కాడని, అతడిని ఎన్‌కౌంటర్ చేశారంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. ఫేక్ న్యూస్ వైరల్ చేయవద్దని సూచించారు.
రైలు పట్టాలపై నిలబడి..
బాధిత బాలిక, ఆమె తల్లి, నానమ్మ సహా తన భార్య పిల్లలను హతమార్చిన అనంతరం రాజ్‌కుమార్ తన తండ్రికి చివరి కాల్ చేశాడు. ఆరుగురిని చంపానని.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని తండ్రితో చెప్పిన తర్వాత మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. సెల్ఫ్ డ్రైవ్ కారులో నందిగామ, కొత్తూరు, షాబాద్ మండలాల్లోని నిర్మానుష్య ప్రాంతాల్లో తిరిగాడు. శనివారం ఉదయం 6 గంటల సమయంలో కొత్తూరు మండలం తిమ్మాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే కారులో పెట్రోలు అయిపోయింది. దీంతో నిందితుడు కారును అక్కడే వదిలేశాడు. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్‌లో పట్టాలపై రైలుకు ఎదురుగా వెళ్లి నిలబడ్డట్టు పోలీసులు గుర్తించారు. పట్టాల మీద కొద్దిసేపు నిలబడిన అతడు రైలు దగ్గరికి రాగానే పక్కకు తప్పుకున్నట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయినట్టు తెలిసింది. ఈ మేరకు రైల్వే స్టేషన్, ట్రాక్ సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన సీసీటీవీల ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
చచ్చేందుకు ధైర్యం చాలలేదా?
రైలు పట్టాలపై నిలబడినప్పటికీ ధైర్యం చాలక రాజ్‌కుమార్ తన ఆత్మహత్యను విరమించుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ తర్వాత రైలులో పరారై ఉండొచ్చనే అనుమానంతో జీఆర్‌పీ పోలీసుల సహకారంతో తిమ్మాపూర్, ఫలక్‌నుమా సహా కొన్ని స్టేషన్లలో ఫుటేజీలు పరిశీలించారు. మరోవైపు తిమ్మాపూర్ నుంచి బెంగళూర్ హైవే లేదా శ్రీశైలం రూట్‌లో లారీలో ట్రావెల్ చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. గతంలో శ్రీశైలం వెళ్లి ఎక్కువ రోజులు గడిపినట్లు స్నేహితులు ఇచ్చిన సమాచారం మేరకు నిందితుడు రాజ్‌కుమార్
అక్కడికి వెళ్లాడేమోనని భావించారు. ఈ క్రమంలోనే శ్రీశైలం, బెంగళూర్‌లో రెండు స్పెషల్ టీమ్స్ పోలీసులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్– బెంగళూరు హైవేలోని లాడ్జీలు, దాబాల్లో తనిఖీలు చేస్తున్నారు. బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లలోని పుటేజీలను పరిశీలిస్తున్నారు. అనుమానిత ప్రాంతాల్లో లుక్ అవుట్ సర్కులర్లు అతికించారు.
రెండు రోజుల పాటు రెక్కీ..
రాజ్‌కుమార్ ఆరు హత్యలను పక్కా పథకం ప్రకారమే చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఎప్పుడు.. ఎలా హత్య చేయాలి..? చుట్టుపక్కన ఇళ్లలోని వారు నిద్రించే సమయంతో పాటు అన్ని విషయాలపై ఊచకోతకు రెండు రోజులు రెక్కీ వేసినట్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే నిందితుడు తన సొంత కారుకు బదులు షాద్‌నగర్‌లో సెల్ఫ్ డ్రైవ్ కారు అద్దెకు తెచ్చుకున్నాడు. హత్యలు చేసిన తర్వాత కారు వదిలి పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని హైదరాబాద్ లేదా షాద్‌నగర్‌లో కొనుగోలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. క్షణికావేశంలో హత్యలు చేస్తే.. ఇంట్లో కత్తులు లేదా ఇతర పదునైన ఆయుధాలను వాడే అవకాశాలు ఉన్నాయి. కానీ, సెల్ఫ్ డ్రైవ్ కారు, షాబాద్ సమీప ప్రాంతాల్లో దొరకని కత్తిని సమకూర్చుకోవడంతో పాటు హత్యల అనంతరం ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయడం, ఆ తర్వాత కూడా ఫోన్లు వాడకపోవడం చూస్తుంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.
