థానే: శివసేన (యూబీటీ) మాజీ ఎంపీ వినాయక్ రౌత్ కోడలు గిరిజా రౌత్ తన భర్త, అత్తామామలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనతో బలవంతంగా గోమూత్రం తాగించారని, ఫేక్ బాబాల వద్దకు తీసుకెళ్లారని, చేతబడి కోసం తన తలవెంట్రుకలను పీకేశారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేశారు. పెండ్లయినప్పటి నుంచి కొన్నేండ్ల పాటు తనను మానసిక, శారీరక వేధింపులకు గురి చేశారని ఫిర్యాదులో ఆమె తెలిపారు.
వివిధ పూజల కోసం పదే పదే నకిలీ బాబాల వద్దకు తీసుకెళ్లేవారని చెప్పారు. బలవంతంగా తనతో గోమూత్రం తాగించారని, క్షుద్రపూజల్లో ఉపయోగించడం కోసం తన తలవెంట్రుకలను పీకేశారని ఆరోపించారు. ఫిరోజ్ బాబా, కాజీ బాబా అనే ఇద్దరు ఈ పూజలు నిర్వహించారని పేర్కొన్నారు. కుటుంబ, వైవాహిక సమస్యలకు అతీత శక్తులే కారణమని తన అత్తమామలు నిందించేవారని వెల్లడించేవారు.
ఆరోపణలను తోసిపుచ్చిన వినాయక్ రౌత్
ఫిర్యాదులో గిరిజా రౌత్.. ‘‘నా భర్తతో దాంపత్య జీవితాన్ని గడపలేకపోయాను. దీంతో మా అత్తమామలు నన్ను కొంకణ్ ప్రాంతంలోని బాబాల వద్దకు వెళ్లమని చెప్పారు. ఇది డబ్బుకు సంబంధించినది కాదు. నన్ను మానసిక, శారీరక హింసకు గురిచేశారు. ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి నేను శాయశక్తులా ప్రయత్నించాను” అని పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. అయితే, గిరిజా రౌత్ ఆరోపణలను వినాయక్ రౌత్ తోసిపుచ్చారు. ఇవన్నీ క్షక్షపూరితమైనవని కొట్టిపారేశారు. భరణం వివాదం కారణంగానే ఆమె ఈ ఫిర్యాదు ఇచ్చారని తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న సంఘటనలు 2018–2022 మధ్య జరిగాయని, అయితే ఆ సమయంలో ఆమె ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు.
