- హైదరాబాద్ తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
- గ్రానైట్ వ్యాపారితో పాటు ముగ్గురు అరెస్ట్
- నిందితుల్లో తండ్రీకొడుకులు
శామీర్ పేట, వెలుగు: ఆదిలాబాద్ అడవుల్లో మనుబోతును వేటాడి మాంసాన్ని తరలిస్తుండగా, తండ్రీకొడుకులతో పాటు మరో వ్యక్తిని శామీర్‌పేట్ పోలీసులు, ఎస్ వోటీ మల్కాజ్గిరి–2- టీమ్ అరెస్ట్ చేసింది. వారి వద్ద టెలిస్కోప్ అమర్చిన లైసెన్స్ డ్ రైఫిల్, ఎయిర్‌గన్, 88 రౌండ్ల మందు గుండు సామగ్రి, 70 కిలోల మనుబోతు మాంసం, కత్తి, ఆయుధ లైసెన్స్ బుక్, మహీంద్రా బొలెరో వెహికల్, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ డీసీపీ రాంకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. యాప్రాల్‌కు చెందిన గ్రానైట్ వ్యాపారి వేముల సునీల్ సల్మాన్ రాజ్, అతని కొడుకు అఖిల్, కూలీ కట్టా ఆదినారాయణతో కలిసి బొలెరో వెహికల్లో ఆదిలాబాద్ అటవీ ప్రాంతానికి వెళ్లారు. టెలిస్కోపిక్ రైఫిల్‌తో సునీల్ మనుబోతును కాల్చి చంపాడు.
మాంసాన్ని యాప్రాల్‌కు తరలిస్తుండగా, పక్కా సమాచారంతో శామీర్‌పేట్ మండలం అంతాయిపల్లి గ్రామంలో పోలీసులు వెహికల్‌ను అడ్డగించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం-, ఆయుధాల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
