- స్థాయి లేని కేటీఆర్, హరీశ్కామెంట్లపై సీఎం రియాక్ట్కావొద్దు
- విబేధాలను పక్కన పెట్టి పని చేస్తం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
యాదాద్రి/యాదగిరిగుట్ట/రామన్నపేట/నార్కట్ పల్లి, వెలుగు : జమిలి ఎన్నికలపై ఆగస్ట్ లో స్పష్టత వస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఆదివారం భువనగిరిలో మీడియాతో మాట్లాడారు. 2028లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోవని, రేవంత్‌రెడ్డి సీఎంగా ఐదున్నరేండ్లు ఉంటారని చెప్పారు. నియోజకవర్గాల సంఖ్య పెరగడంతో పాటు మహిళా బిల్లు సైతం వస్తుందని, దీనికి సంబంధించి తమ వద్ద సమాచారం ఉందన్నారు.
రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 183కు, పార్లమెంట్ సీట్లు 23కు పెరుగుతాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 117 అసెంబ్లీ సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోనే కాదు.. గజ్వేల్ కూడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీశ్‌రావు తన స్థాయికే సరిపోరని, వారి కామెంట్ల కు సీఎం రేవంత్‌రెడ్డి స్పందించొద్దన్నారు. కార్యకర్తలు విభేదాలు పక్కన పెట్టి పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు, మంత్రులమైన తమ మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయని, అయినా వాటిని పక్కన పెట్టి టీమ్ మాదిరిగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
మళ్లీ రామన్నపేట నియోజకవర్గం
యాదాద్రి జిల్లా రామన్నపేట, యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో హ్యామ్ రోడ్డు పనులకు సంబంధించిన పైలాన్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... గతంలో రద్దయిన రామన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం మళ్లీ ఏర్పడుతుందన్నారు. అందుకే రామన్నపేటను డెవలప్చేస్తున్నామని, ఇక్కడ 100పడకల హాస్పిటల్నిర్మిస్తామని చెప్పారు.
చిట్యాల, భువనగిరి రోడ్డును నాలుగు లేన్లుగా, హైదరాబాద్, విజయవాడ హైవేను ఎనిమిది లేన్లుగా విస్తరిస్తామని చెప్పారు. ఆలేరు, భువనగిరి ప్రజల ఉసురు తగిలే కేసీఆర్కాలు విరిగి ఫాంహౌస్‌లోనే ఉంటున్నారన్నారు. అలాగే నార్కట్ పల్లిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. రాజకీయ జన్మనిచ్చి, ఇంత పెద్ద నాయకుడిగా చేసిన ఈ ప్రాంత ప్రజలను ఎన్నటికీ మర్చిపోనని, మరో జన్మ ఉంటే ఇక్కడే పుట్టి రుణం తీర్చుకుంటానని చెప్పారు.
బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పూర్తి చేయడమే తన జీవిత లక్ష్యమని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ లు బీర్ల అయిలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, భువనగిరి, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కడియం శ్రీహరి, యశశ్విని రెడ్డి, యాదాద్రి, నల్గొండ కలెక్టర్లు అనురాగ్ జయంతి, బి.చంద్రశేఖర్, అడిషనల్ కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, ఆర్డీవో అశోక్ రెడ్డి పాల్గొన్నారు.
