పోక్సో కేసు నిరుపయోగంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీనేజర్ల సెక్సువల్ రిలేషన్షిప్కు సంబంధించి లేదా లైంగిక నేరాల విషయంలో పోక్సో కేసు మిస్ యూజ్ అవుతోందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు తమ పార్ట్నర్స్ తో వెళ్లిపోతే.. పరువు పేరుతో అబ్బాయిలపై పోక్సో కేసులు పెట్టడం పరిపాటి అయిపోయిందని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ తో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది.
అబ్బాయి లేదా అమ్మాయి ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడాన్ని ప్రభుత్వాలు ఆపగలవా..? పోక్సో కేసు అనేది చిన్నారులపై లైంగిక వేధింపులు, అత్యాచారానికి సంబంధించిన కేసు. 15 నుంచి 18 సంవత్సరాల వయసు సున్నితమైంది.. ప్రయోగాత్మకమైనది. ఆ వయసులో లవ్ రిలేషన్ లో ఉన్న వారిపై కూడా పోక్సో కేసు పెట్టడం ఎంత వరకు కరెక్ట్. అది నిజంగా పోక్సో కేసు కిందికి వస్తుందా..? అని ప్రశ్నించింది.
కౌమారదశలో (అడాలసెంట్) ఉన్నవారి ప్రైవసీ హక్కుకు సంబంధించిన ఒక కేసును కోర్టు సుమోటోగా విచారిస్తున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది కోర్టు. కౌమార బాలికలు రిలేషన్షిప్ లో పడిపోకుండా.. రెండు నిమిషాల సుఖానికి లొంగిపోకుండా తమ లైంగిక కోరికలను కంట్రోల్ చేసుకోవాలని కలకత్తా హైకోర్టు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
దుమారం రేపిన కలకత్తా హైకోర్టు వ్యాఖ్యలు:
రెండు నిమిషాల సుఖాన్ని కంట్రోల్ చేసుకోవాలని కలకత్తా కోర్టు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వివాదాస్పద తీర్పుకు దారితీసిన కేసు ప్రస్తుత స్థితి గురించి సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ ఈ రోజు (సోమవారం,13, 07, 2026) సుప్రీంకోర్టుకు తెలియజేశారు. 25 ఏళ్ల యువకుడితో ఒక మైనర్ పారిపోయిన కేసు ఇది అని.. ఈ వ్యక్తిగత కేసు పరిష్కారం అయ్యిందని దివాన్ చెప్పారు. మొత్తంగా కేసు ముగిసినట్లు కోర్టుకు చెప్పారు. కోర్టు ఒక కమిటీని నియమించింది. సామాజిక కార్యకర్తలు ఆ బాలికతో మాట్లాడారు. పోక్సో (POCSO) కేసులలో వ్యవస్థ వైఫల్యంపై ఒక బలమైన నివేదిక ఫైల్ చేసినట్లు ఆ సీనియర్ న్యాయవాది అన్నారు.
పోక్సో చట్టం ప్రకారం మైనర్లకు కొన్ని పునరావాస చర్యలకు అర్హత ఉందని దివాన్ తెలిపారు. ఇది ఇష్టంతో పారిపోవడమా లేక ఎత్తుకెళ్లడమా అని సుప్రీంకోర్టు ప్రశ్నించగా, ఆ అమ్మాయి ఆ వ్యక్తితో ఉండాలనుకుందని, అతడితో ఆమెకు ఒక బిడ్డ కూడా ఉందని న్యాయవాది దివాన్ చెప్పారు.
►ALSO READ | మహారాష్ట్ర ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. కీలక స్కీమ్ నుంచి సగం మంది ఔట్.. 92 లక్షల మంది మహిళలు లబోదిబో..!
పోక్సో చట్టం దుర్వినియోగంపై కోర్టు అనంతరం ఒక సాధారణ వ్యాఖ్య చేసింది. "16-18 ఏళ్ల వయసులో వారు ఒక రిలేషన్షిప్ ఏర్పరచుకుని వెళ్లిపోతారు. తమ పరువును కాపాడుకునే నెపంతో తల్లిదండ్రులు క్రిమినల్ బాధ్యతను మోపుతారు. చివరికి మేము నిర్దోషులుగా విడుదల చేయాల్సి ఉంటుంది అని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఇలాంటి సమస్యలను నివారించడానికి ఒక వ్యవస్థ కచ్చితంగా అవసరమని దివాన్ అన్నారు. ఆ అమ్మాయి ఇప్పటికే తన భర్తతో స్థిరపడి సంతోషంగా ఉంది. కౌమారదశలో ఉన్నవారి సంక్షేమం, బాలల రక్షణ కోసం చర్యలు తీసుకోవడమే అసలైన సమస్య న్యాయవాది దివాన్ అన్నారు.
17-18 ఏళ్ల వయసున్న వారిని జైలుకు పంపుతున్న కేసులను దివాన్ ప్రస్తావించారు. యువత స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం సమగ్రమైన సూచనలు ఇచ్చింది. వాటిని లాజికల్ ముగింపునకు తీసుకురావాల్సి ఉందని ఆమె అన్నారు.
2012లో టీనేజర్ల మధ్య రిలేషన్ షిప్ లేదా లైంగిక ఆమోద వయస్సును 16 నుంచి 18 ఏళ్లకు పెంచారు. అంతకు ముందే టీనేజర్లతో ఇలాంటి రిలేషన్ షిప్స్ ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది కేవలం 2012 తర్వాతే జరగడం లేదు. బాల్య వివాహాల మాదిరిగా ఇది అంతకుముందు నుంచే ఉంది. దీనికి సంబంధించిన వయస్సు 18 గా నిర్ధారించినప్పుడు అది చట్టవిరుద్ధం అవుతుంది అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి కేసులలో తమ ఆదేశాలు ఆచరణాత్మకంగా ఉండాలని కూడా అది చెప్పింది.
6వ తరగతి నుంచే పోక్సోపై అవగాహన:
తమ సిఫార్సులను ఆమోదిస్తే, వాటిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో అమలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అన్నారు. వాటిలో ఒకటి కౌమార విద్యకు సంబంధించింది. ఆరో తరగతి నుంచి దశలవారీగా పోక్సో (POCSO) అవగాహనను ప్రవేశపెట్టాలి. అని చెప్పారు. పోక్సో చట్టం కింద కేసులను పర్యవేక్షించడానికి ఒక డాష్‌బోర్డ్ ఉండాలని దివాన్ జోడించారు.
ప్రతి హైకోర్టులో ఇప్పటికే బాలల హక్కుల కమిటీ ఉందని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటువంటి పర్యవేక్షణ చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ అంశంపై జూలై 17న తదుపరి విచారణ జరపనుంది.
