ఒక పార్టీని అధికారంలోకి తెచ్చిన స్కీమ్ అది.. మహిళలందరికీ నగదు ఆధారిత పథకం అది. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా.. అర్హులా కాదా చూడకుండా.. దాదాపు ప్రతి మహిళకు నగదు పంచేసిన పథకం. టార్గెట్ మహిళా ఓట్లు.. ఎన్నికల్లో గెలుపు.. నేరుగా చేతికి క్యాష్ ఇవ్వడంతో.. గంపగుత్తగా మహిళల ఓట్లు వేయించుకుని ఊహించని రీతిలో మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చింది బీజేపీ కూటమి.. ఇవి మాఝీ లడ్కీ బహీన్ యోజన పథకం విషయంలో ప్రతిపక్షాల విమర్శలు. అలాంటి స్కీమ్ విషయంలో ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏకంగా దాదాపు సగం మందిని పథకం నుంచి తొలగించడం సంచలనంగా మారింది.
అలాంటి స్కీమ్ నుంచి ఉన్నట్లుండి ఏకంగా 90 లక్షల మంది మహిళలను తొలగించడం సంచలనంగా మారింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 2.4 కోట్ల మహిళల్లో 38 శాతం లబ్దిదారులను తొలగించింది ప్రభుత్వం. ఇంత భారీ మొత్తంలో ఒక స్కీమ్ నుంచి లబ్దిదారులను తొలగించడం బహుషా ఈ మధ్య కాలంలో ఇదే కావచ్చు. ఆ పథకం పేరే మాఝీ లడ్కీ బహీన్ యోజన. విపక్షాల నుంచి విమర్శలు, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు ఎన్ని వచ్చినా.. ఆ పథకాన్ని ఆపలేకపోయాయి. ఎన్నికల ముందు నేరుగా మహిళల చేతికి నగదు అందించిన స్కీమ్ పై రేగుతున్న దుమారంతో ఎట్టకేలకు ప్రభుత్వం అనర్హులను తొలగించేందుకు ముందుకు వచ్చింది.
ఈ పథకం నుంచి 90 లక్షలకు పైగా మహిళల పేర్లను తొలగించారు. ఇ-కేవైసీ ప్రక్రియ తర్వాత సుమారు 80 లక్షల పేర్లను తొలగిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల క్రితం ప్రకటించింది.
దాదాపు 50 నుండి 55 లక్షల మంది మహిళలు డెడ్ లైన్ లోపు ఇ-కెవైసి చేయకపోవడంతో తొలగించినట్లు ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో, 12 లక్షల మంది మహిళల ఆదాయం స్కీమ్ నిబంధనలను మించి ఉండటం. అంటే వారు పేదవారు కాకపోవడం. ఇక 4.5 లక్షల మందికి పైగా మహిళలు 65 సంవత్సరాల వయసు పైబడిన వారు కావడంతో తొలగించినట్లు పేర్కొన్నారు.
మహిళల స్కీమ్ పురుషులకు..!
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇది పూర్తిగా మహిళలను ఉద్దేశించిన స్కీమ్. ఈ పథకం కింద ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలలోని మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తారు. అలాంటి స్కీమ్ లో 14,000 మంది పురుషులకు వర్తించడంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో 14 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మొత్తం ప్రక్రియంలో అత్యధికంగా 28 లక్షల మంది మహిళలను ఒక్క బీడ్ జిల్లాలోనే తొలగించారు.
కేవైసీ పూర్తి చేయడానికి 8 నెలలా..?
ఈ స్కీమ్ పూర్వాపరాల లోకి వెళ్తే అన్ని ఆశ్చర్యకరమైన విషయాలే. ఈ స్కీమ్ కు సంబంధించి ఇ-కేవైసీ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఎనిమిది నెలల గడువు ఇవ్వటం. స్కీమ్ అక్రమంగా అనర్హులకు ఇస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న క్రమంలో ఇంత ఎక్కువ గడువు ఇవ్వటం చర్చనీయాంశం. దాదాపు 55 లక్షల పేర్లను తొలగించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
►ALSO READ | అయోధ్య విరాళాల చోరీలో కేసులో కీలక పరిణామం.. శ్రీ రామ్ జన్మభూమి ట్రస్ట్‌కు సుప్రీం కోర్టు నోటీసులు
సంవత్సర ఆదాయం రెండున్నర లక్షల రూపాయలకు మించిన సుమారు 12 లక్షల మంది మహిళలు ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఈ స్కీమ్ లో ఉన్నారు.వీరిలో దాదాపు 5 లక్షల మంది మహిళలు ఇప్పటికే నమో షేత్కారి యోజన కింద లబ్ధి పొందుతున్నారు. వ
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పెను భారం:
ఇదిలా ఉండగా, ఈ పథకంపై అయిన ఖర్చు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పెను భారం చూపవచ్చునని కాగ్ వారం రోజుల కిందటే ఒక నివేదికను ప్రచురించింది. ఈ పథకం కింద అయిన 3 వేల5 వందల 41 కోట్ల ఖర్చు లెక్కకు తేలకుండా ఉన్నట్లు CAG పేర్కొంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఎన్నికల ముందు 2024 జూన్ 28న ఆమోదించిన విషయం తెలిసిందే.
నష్టాన్ని భరించేది ఎవరు..?
ఎన్నికల ముందు ఆగ మేఘాలమీద ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ప్రభుత్వ ధనం వృధా అయినట్లు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఓట్ల కోసం అనర్హులకు నగదు పంపిణీ కింద ఈ పథకాన్ని వాడినట్లు ఆరోపిస్తున్నారు. ఎలాంటి విధి విధానాలు లేకుండా.. లబ్దిదారులను ఫైనల్ చేయకుండా.. కేవలం ఓట్ల కోసం ఈ స్కీమ్ తీసుకొచ్చి అధికార మహాయుతి కూటమి లబ్ది పొందినట్లు విమర్శలు కొనసాగుతున్నాయి. పరోక్షంగా ఓటుకు నోటు స్కీమ్ గా పథకాన్ని వినియోగించారని.. ఇంతమంది అనర్హులకు ఇచ్చిన డబ్బును తిరిగి వసూలు చేస్తారా..? లేదా ఈ భారం మొత్తం ఎవరు భరించాలని పార్టీలతో పాటు అక్కడ సమాన్య జనం ప్రశ్నిస్తున్నారు.
